శిల్పాకు వైసీపీలో దారులు మూసుకున్నట్లేనా?

Fri Apr 21 2017 15:35:55 GMT+0530 (IST)

భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల సీటు విషయంలో ఏర్పడిన రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆ సీటు తమ కుటుంబానికే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి తనయ అఖిల పట్టుపడుతుండగా... వారి ప్రత్యర్థి వర్గానికి చెందిన శిల్పా మోహన రెడ్డి కూడా ఆ సీటు తనకే ఇవ్వాలని చంద్రబాబును డిమాండు చేస్తున్నారు. ఇవ్వకపోతే తాను వైసీపీకి వెళ్తానని కూడా ఆయన నాల్రోజులుగా హడావుడి చేస్తున్నారు. అయితే... నిన్న అచ్చెన్నాయుడి మధ్యవర్తిత్వం ఆ తరువాత చంద్రబాబుతో భేటీ తరువాత ఆయన నోటి నుంచి వైసీపీ అన్న మాట రావడం లేదు. టిక్కెట్ పై హామి దొరక్కపోయినా ఇంకేదైనా హామీ దొరికిందో ఏమో కానీ ఆయన వైసీపీ గురించి మర్చిపోయారు. దీంతో శిల్పా.. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడానికి తమ పార్టీని వాడుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
    
కాగా జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఆయన తమ పార్టీలోకి వస్తే టిక్కెట్ ఇవ్వాలని భావించినా ఇప్పుడు మనసు మార్చుకున్నారట. నంద్యాలకు చెందిన వేరే వ్యక్తికి టిక్కెట్ దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. నంద్యాలలో సినిమా థియేటర్ల యజమాని ఉలవల ప్రతాప్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు.
    
కేవలం టికెట్ కోసమే రాజకీయాలు చేసే శిల్పా లాంటి వారిని నమ్మితే భవిష్యత్తులోనైనా వారు నమ్మకంగా ఉంటారన్న గ్యారెంటీ ఏముందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారుతానంటూ లీకులిచ్చిన శిల్పామోహన్ రెడ్డి బుధవారం తిరిగి చంద్రబాబుతో సమావేశమవడం ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడంతో వైసీపీ నాయకత్వం కూడా శిల్పామోహన్ రెడ్డిని పట్టించుకోకూడదన్న నిర్థారణకు వచ్చినట్టు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/