Begin typing your search above and press return to search.

బాబు దుర్మార్గం..మన సన్మార్గం మద్యే పోరాటం

By:  Tupaki Desk   |   27 July 2017 4:24 PM GMT
బాబు దుర్మార్గం..మన సన్మార్గం మద్యే పోరాటం
X
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు బాబు దుర్మార్గం... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చూపించిన సన్మార్గం మద్యే పోరాటం ఉంటుంద‌ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సీనియ‌ర్ నేత‌ - కాంగ్రెస్ పార్టీ మాజీ నాయ‌కుడు మల్లాది విష్ణు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హాజ‌రైన పార్టీ శ్రేణులు - వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడారు. విష్ణన్న - ఆయనతో పాటు వచ్చిన వారంతా వైఎస్సార్ తో నడిచిన వారేన‌ని గుర్తుకు చేసుకున్నారు. వారంతా సొంత ఇంటికి వచ్చినట్లేన‌ని తెలిపారు. మల్లాది విష్ణు మా కుటుంబంలో కే కాదు... మా గుండెల్లోకి వస్తున్నాడు అని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నమ్మించే ప్రయత్నం సీఎం చంద్ర‌బాబులో క‌నిపిస్తోంద‌ని వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. ``చంద్రబాబు మూడేళ్ల పాలన చూశాం.ఆయన పాలనలో కనిపించేవి.. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన మనస్తత్వం... లక్షల కోట్ల దోపిడీ.. రైతులకు చేసిన అన్యాయాలు - ఒక్కటైనా హామీని నెరవేర్చని మనస్తత్వం కనిపిస్తుంది. మద్యం దుకాణాలు - గుడి భూములు - జెన్కో కాంట్రాక్ట్ లు - విశాఖ భూములు - లంచాలు మింగి భూములను పెద్దలకు కట్టబెట్టడం చంద్రబాబు నడిచే దారిలో కనిపిస్తోంది. పుష్కరాల్లో తన షూటింగ్ కోసం 30 మందిని పొట్టన పెట్టుకోవడం ఆయ‌న‌కే చెల్లింది. కాల్ మనీ - సెక్స్ రాకెట్ ను ఊతమివ్వడం బాబు పాల‌న‌లోనే సాధ్యం. ప్లేట్ లు పట్టుకుని కంచాలు మోగిస్తే కేసులు ఉంటాయి...ల‌క్ష‌ల కొద్దీ లంచాలు మింగితే కేసులు ఉండవు. కొడుకును మంత్రిని చేయడానికి అడ్డదారులు ఉంటాయి. తన కేబినెట్‌లో కనీసం ఒక్క ముస్లీంకు స్థానం ఉండదు` అంటూ జ‌గ‌న్ ప్రాస‌తో ప్రసంగించారు.

చంద్రబాబు 420 పాలనలో రాష్ట్రం అంతా 144 సెక్షన్ విధిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ``చంద్రబాబు పాలనలో దుర్మార్గం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజల ముందు ఉన్నది రెండో దారి. అది మనదారి. మనమార్గం సన్మార్గం. అది వైఎస్ఆర్ వేసిన రహదారి. మన మార్గంలో రైతులకు ఉచిత వైద్యం - ఆరోగ్య శ్రీ - పేదలకు ఫీజు రియాంబర్స్ మెంట్ - పేదలకు భూముల పంపిణీ - ఒక్క రూపాయి ఆర్టీసీ - కరెంట్ చార్జీలను పెంచకపోవడం కనిపిస్తుంది. ప్రజల పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. రాజకీయ నేతల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేలా ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించాం. చంద్రబాబు వెయ్యి కుట్రలు చేసిన తట్టుకునే ధైర్యం మనబాటలో కనిపిస్తుంది. అధికారం కోసం గడ్డి తినం... అడ్డతోవలు తొక్కం. చంద్రబాబు దుర్మార్గం.. మన సన్మార్గం మద్యే పోరాటం` అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

నంద్యాలలో భూమా నాగిరెడ్డి చనిపోతే తప్ప అమ్ముడు పోయిన ఎమ్మెల్యే ల నిమైజకవర్గాల్లో ఎన్నికలు పెట్టే ధైర్యం లేదని ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరును జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. కనీసం డిపాజిట్లు కూడా రావని భయమ‌ని వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఉప ఎన్నికల రాగానే ఇఫ్తార్ విందులు.. వాగ్ధానాలపై వాగ్ధానాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ``చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వారిపై కళ్లెర్ర జేస్తున్నారు ప్రశ్నించిన వ్యక్తిని 'నువ్వు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మనిషివి.. జగన్‌ పంపిస్తే వచ్చావు' అని తిడుతున్నారు. చంద్రబాబు వీధిరౌడీలా మాట్లాడుతున్నారు. బాబు అన్యాయ‌మైన పాల‌న‌పై ప్రశ్నించే ప్రతి గొంతూ వైఎస్ఆర్సీపీ గొంతే అవుతుంది. ప్రజలను మరోసారి మోసం చేయలేడు. రాజకీయాలలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదు. నవరత్నాలతో రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారు`` అని జ‌గ‌న్ తెలిపారు. ఓటుకు కోట్లు కోసం పక్క రాష్ట్రం సీఎం కాళ్లు ప‌ట్టుకున్నారని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.