Begin typing your search above and press return to search.

బాబు గురించి ఉన్న పుకార్ల‌ను చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   28 March 2017 6:18 PM GMT
బాబు గురించి ఉన్న పుకార్ల‌ను చెప్పిన జ‌గ‌న్‌
X
అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు చెందిన పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో వైఎస్‌ జగన్‌ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీ మంత్రి నారాయణ..అని పుకార్లు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని నారాయణను చంద్రబాబు ఎందుకు మంత్రిని చేశారంటేనే నారాయణ...చంద్రబాబు బినామీ అని బయట పుకార్లు సాగుతున్నాయని వైఎస్‌ జగన్ వివ‌రించారు. మంత్రులు నారాయణ-గంటా వియ్యంకులు కావడం, వారిద్ద‌రికీ సంబంధించిన అంశం కాబట్టే ప్రభుత్వం దాటవేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

పదో తరగతికి సంబంధించిన తెలుగు, హిందీ, సైన్స్‌ పేపర్లు లీక్ చేయించినట్లు తెలుస్తోందని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయని అభిప్రాయపడ్డారు. `లీక్‌పై ఇప్పుడు చర్చించరట. 30న ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉంది, ప్రభుత్వ తీరు ఇల్లు పూర్తిగా కాలాక..ఫైరింజన్లు పంపుతామన్నట్లుగా ఉంది` అని ఎద్దేవా చేశారు. మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని మండిపడ్డారు. నారాయణకు 1 నుంచి 100 ర్యాంకులు వచ్చాక..సీఎం స్పందిస్తారా? అని నిలదీశారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోరని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తాము ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. `మేం ప్రశ్నా పత్రాల లీక్‌ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్‌ బిల్లును ఆమోదించారు` అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని జ‌గ‌న్‌ విమర్శించారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై వేసిన విచారణకు అతీగతీ లేదని ధ్వజమెత్తారు. ఏ విషయంపైనైనా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అన్ని ఆధారాలు చూపితే స్పందించడం లేదని, ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డాడు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీపై త‌మ‌ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టామని జ‌గ‌న్ తెలిపారు. ఈ ఏడాది 6.5 లక్షల మంది టెన్త్‌ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని,. పేపర్‌ లీక్‌ అంతమంది విద్యార్థులకు సంబంధించిన అంశం అన్నారు. లీక్‌పై మా దగ్గరున్న ఆధారాలు బయటపెట్టామని, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నివేదికను చూపించామని చెప్పారు. లీకైనట్లు ఆ నివేదికలో ధ్రువీకరించారని జ‌గ‌న్‌ వెల్లడించారు. పేపర్‌ లీక్‌పై మొదట సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు బుకాయించారన్నారు. ఆ తరువాత పేపర్‌ లీకైనట్లు అంగీకరించి, ఆ నెపాన్ని అటెండర్‌పై నెట్టేందుకు మంత్రి గంటా ప్రయత్నించారని విమర్శించారు. నిజానికి అటెండర్‌కు అంత ధైర్యం ఎలా వస్తుందని జ‌గ‌న్ సూటిగా ప్రశ్నించారు. యాజమాన్యం అండ లేకుండా అటెండర్‌ అలా ఎందుకు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు..చాలా చోట్ల పేపర్‌ లీకైందని జ‌గ‌న్‌ ఆరోపించారు. ఈ విషయంపై హిందుపురంలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. లీకేజీకి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని, బాధ్యులను కేబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/