Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ తో బాబుకు జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చేశాడా?

By:  Tupaki Desk   |   26 May 2019 11:59 AM GMT
ప్రెస్ మీట్ తో బాబుకు జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చేశాడా?
X
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కూడా ఊహించ‌ని మెజార్టీ ఏపీ ప్ర‌జ‌లు ఇచ్చారా? అంటే అవున‌ని చెప్పాలి. చారిత్ర‌క విజ‌యం అనంత‌రం ముక్త‌స‌రిగా మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఆర్నెల్ల లోపు ప్ర‌జ‌ల చేత మంచి ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాన‌ని చెప్పాలి. త‌ర్వాతి రోజున ఆయ‌న పార్టీ ఎంపీ.. ఎమ్మెల్యేల‌తో మాట్లాడుతూ.. బాబు 23 మంది ఎమ్మెల్యేల్ని తీసుకెళితే.. స‌రిగ్గా 23వ తేదీనే.. బాబుకు 23 మంది ఎమ్మెల్యేల్ని మాత్ర‌మే మిగిల్చాడ‌ని.. దేవుడు ఉన్నాడంటూ సున్నితంగా మాట్లాడుతూనే.. బాబు పాపాన్ని ఎండ‌గ‌ట్టే ప్ర‌యత్నం చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయిన జ‌గ‌న్‌.. ఢిల్లీలో ఈ రోజు (ఆదివారం) బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. జ‌గ‌న్ భేటీ త‌ర్వాత చాలా అరుదుగా మాత్ర‌మే తెలుగులో ట్వీట్ చేసే మోడీ.. జ‌గ‌న్ తో మీటింగ్ అద్భుత‌మ‌నేశారు. అనంత‌రం ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన జ‌గ‌న్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ ప్రెస్ మీట్ ను రెండు ముక్క‌ల్లో చెప్పేసి.. సారాంశాన్ని ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. బాబు పాల‌న‌లో ఏపీ అప్పుల కుప్ప‌గా చేశారు.. ఎన్నిక‌ల హామీల్ని మ‌ర్చిపోలేనంటూనే హోదా గురించి మోడీని క‌లిసిన ప్ర‌తిసారీ ప్ర‌స్తావిస్తూనే ఉంటాన‌న్నారు. సారాంశాన్ని చెప్పాల్సి వ‌స్తే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో బాబు చాలా త‌ప్పులు చేశారు.. శిక్ష త‌ప్ప‌దన్న విష‌యాన్ని చాలా లైట్ గా చెప్పారు. అంత‌లోనే.. చంద్ర‌బాబుతో త‌న‌కు ఎలాంటి వ్య‌తిరేక‌త లేదంటూ.. తానేం చేసినా చ‌ట్ట‌బ‌ద్ధంగా మాత్ర‌మే చేస్తాన‌న్న సందేశాన్ని ఇచ్చేశారు.

తన తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు తానెప్పుడూ సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌లేద‌ని.. ఏ అధికారికి ఫోన్ చేయ‌లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్‌.. అప్ప‌ట్లో బెంగ‌ళూరులో ఉండేవాడిన‌ని చెప్పారు. తాను హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా త‌న త‌ల్లిదండ్రుల్ని క‌ల‌వ‌టానికి వ‌చ్చే వాడిని త‌ప్పించి మ‌రింకే ప‌నులు చేసే వాడిని కాద‌న్నారు.

అలాంటి త‌న‌పై.. త‌న తండ్రి మ‌ర‌ణించిన వెంట‌నే కేసులు పెట్టార‌ని.. ఈ కుట్ర‌లో చంద్ర‌బాబుకు పాత్ర ఉంద‌న్న విష‌యాన్ని చెప్పారు. అమ‌రావ‌తిలో భూ స‌మీక‌ర‌ణ‌.. కేటాయింపులో కుంభ‌కోణం ఉంద‌న్న ప్ర‌స్తావ‌న‌తో రానున్న రోజుల్లో త‌మ ప్ర‌భుత్వం దృష్టి పెట్టే అంశాన్ని.. బాబుకు ముప్పుగా మార‌నున్న అంశాన్ని చెప్పేశార‌ని చెప్పాలి.

రాష్ట్రం ఓవ‌ర్ డ్రాఫ్ట్రుపై ఏ విధంగా బ‌తుకుతుందోన‌న్న విష‌యాన్ని ప్ర‌ధానికి చెప్పాన‌న్నా జ‌గ‌న్‌.. రాష్ట్ర విభ‌జ‌న నాటికి రూ.97వేల కోట్ల అప్పులు ఉంటే.. ఐదేళ్ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆ అప్పులు రూ.2.75ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగిన విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. అప్పుల మీద వ‌డ్డీనే దాదాపు రూ.20వేల కోట్లు చెల్లిస్తున్న విష‌యాన్ని చెప్పిన జ‌గ‌న్‌.. రాష్ట్రానికి అప్పులు ఎంతో భారంగా మారిన‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ఉన్న రుణాల్ని ద‌శ‌ల‌వారీగా తీరుస్తామ‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని ర‌కాలుగా కేంద్రం స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. త‌న విన్న‌పానికి మోడీ సానుకూలంగా స్పందించిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

త‌న మీడియా స‌మావేశంలో రాష్ట్రంలో నెల‌కొన్న ఆర్థిక స‌మ‌స్య‌ల్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టం ద్వారా.. త‌న‌కున్న స‌వాళ్ల‌నుజ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. ఆర్నెల్ల నుంచి ఏడాది లోపు విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తామ‌ని.. రాష్ట్రంలో ఎక్క‌డా అవినీతి లేకుండా చేస్తామ‌న్నారు. అవినీతి జ‌రిగితే వెంట‌నే ఆ ప‌నులు ర‌ద్దు చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. త‌క్కువ ధ‌ర‌కు కోట్ చేసిన వారికే టెండ‌ర్లు అప్ప‌గిస్తామ‌న్నారు.

ప్ర‌మాణ‌స్వీకారం రోజున తానొక్కడినే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని.. వారం.. ప‌ది రోజుల త‌ర్వాత మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించిన‌ట్లుగా చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టో త‌న‌కు భ‌గ‌వ‌ద్గీత‌.. బైబిల్.. ఖురాన్ గా పేర్కొన్న జ‌గ‌న్ 2024 నాటికి మ‌ద్యాన్ని ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కే ప‌రిమితం చేసి ఓట్లు అడ‌గ‌నున్న‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ ప్ర‌త్యేక హోదాకు తెలంగాణ అధికార ప‌క్ష మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఫ‌లితాలు వెలువ‌డిన రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ తాను మాట్లాడే ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఏదో ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని చెబుతూనే.. పాల‌న విష‌యంలో తానెంత క‌ర‌కుగా ఉంటాన‌న్న సంకేతాలు జ‌గ‌న్ ఇచ్చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.