ప్రతీకారంపై నాయకులకు జగన్ స్పష్టమైన ఆదేశాలు

Sun Jun 16 2019 18:23:21 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలపై - నాయకులపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించే ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ - టీడీపీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకులు - కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ అంశంపై భవిష్యత్ లో పాటించాల్సిన కార్యచరణను - అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరును గురించి ప్రత్యేకంగా తీర్మానం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంత్రులు - ఎమ్మెల్యేల ద్వారా ఏపీలోని నాయకులందరికీ కీలక ఆదేశాలు జారీ చేశారన్నదే దాని సారాంశం. ‘‘తెలుగుదేశం పార్టీ హయాంలో వైసీపీ కార్యకర్తలు - నాయకులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయాలను ప్రస్తుతానికి మర్చిపోదాం. అయితే వాటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఆ పార్టీ నాయకులపై దాడులకు దిగవద్దు. దాడుల వల్ల ప్రభుత్వంపై మచ్చ పడే అవకాశం ఉంటుంది. దీనిని ప్రతిపక్షం తమకు అనుకూలంగా మలచుకుంటుంది. కాబట్టి  ఎవరు ఇలాంటి పనులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం చెప్పారట.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు - ఆయా జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులకు జగన్ ప్రత్యేకించి ఈ విషయంపై సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నారని తెలిసింది. ఆ సందర్భంలోనే ఆయన పై విధంగా స్పందించారని సమాచారం. అంతేకాదు మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేస్తానని చెప్పిన జగన్.. ఇటువంటి ప్రతీకార ఘటనలు జరిగే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఇలాంటివి అడ్డంకులు కాకూడదనేదే ఆయన అలోచన అని పార్టీలోని కొందరు అంటున్నారు.

మరోవైపు జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతిపక్షానికి పని లేకుండా చేస్తున్నారు. టీడీపీకి కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు అంశాలే దొరకడం లేదు. అందుకే ఆ పార్టీ నేతలు తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ విషయంపై సమావేశం కూడా ఏర్పాటు చేయడంతో జగన్ పైన పేర్కొన్న ఆదేశాలు జారీ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా టీడీపీకి చాన్స్ రాకపోతే వాళ్లు లేవనెత్తడానికి అంశాలే కరువయ్యే పరిస్థితి కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.