బ్రేకింగ్: రోజా - ఆళ్లకు జగన్ కబురు

Tue Jun 11 2019 13:45:40 GMT+0530 (IST)

వైసీపీలో అసంతృప్తి జ్వాల చెలరేగింది. ఏపీ మంత్రివర్గంలో చోటు ఖాయమనుకున్న ఎమ్మెల్యేలు  రోజా - ఆళ్ల రామకృష్ణ రెడ్డిలకు చోటు గల్లంతైంది. సీఎం జగన్ రెడ్డి సామాజికవర్గ మైన వీరిద్దరికీ సామాజిక కోణంలో మంత్రి పదవులను ఇవ్వలేదు జగన్. అందుకే ఈ హఠాత్ పరిణామానికి కలత చెందిన రోజా.. మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు.ఇక అప్పటినుంచి వైసీపీ అధిష్టానానికి ఫోన్ లో అందుబాబులో ఉండకుండా పోయారు. అలిగి కూర్చున్నారు. ఇక ఆళ్ల రామకృష్ణా రెడ్డికి జగన్ హామీనిచ్చాడు. లోకేష్ ను ఓడిస్తే ఆళ్లను మంత్రి పదవిని ఇస్తామని జగన్ ప్రచారంలో స్వయంగా చెప్పుకొచ్చాడు.  కానీ మంత్రివర్గ విస్తరణలో మాత్రం చోటివ్వలేదు.

అయితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సైతం మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడంతో మంగళగిరి వెళ్లిపోయి ముభావంగా ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరి అలకతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది.

తాజాగా విజయశాంతి సైతం రోజాకు మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ తప్పు చేశాడని కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా రోజాపై సానుభూతి వెల్లివిరిసింది. టీడీపీతోపాటు చంద్రబాబు ఎంతో ఫైట్ చేసి ఆ పార్టీ చర్యలకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో రోజా ముందువరుసలో ఉంటారు. జైలుకు కూడా వెళ్లారు. ఆమెకే జగన్ మంత్రి పదవి ఇవ్వకపోవడం.. కొత్తగా వచ్చిన వారికి కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది.

అందుకే తాజాగా జగన్ తరుఫున వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎమ్మెల్యేలు రోజా - ఆళ్ల రామకృష్ణరెడ్డికి ఫోన్ చేశారు. జగన్ ను వీరిద్దరూ కలవాలని కోరారు. దీంతో రోజా హైదరాబాద్ నుంచి జగన్ ను కలిసేందుకు  బయలు దేరినట్టు తెలిసింది. ఆళ్ల కూడా విజయవాడ వస్తున్నారు. మరి వీళ్లను జగన్ ఎలా బుజ్జగిస్తాడు.? ఎలాంటి పదవులు కట్టబెడుతాడన్నది వేచిచూడాలి.