Begin typing your search above and press return to search.

అబ్బ.. జగన్ రాజకీయ నాయకుడు అయ్యాడు

By:  Tupaki Desk   |   31 July 2015 12:29 PM GMT
అబ్బ.. జగన్ రాజకీయ నాయకుడు అయ్యాడు
X
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు రాజకీయ నాయకుడు అయ్యాడు. రాజకీయ నాయకుడిగా ఇప్పటికి మారాడు. ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తగా, యువకుడిగా, వైఎస్ కుమారుడిగా ఉన్న జగన్ కు ఎట్టకేలకు రాజకీయ లక్షణాలు వచ్చేశాయి. అందుకే గురువారం జరిగిన పార్టీ సమావేశంలో నేనేమైనా మారాలా? నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించాడు. నిజానికి ఇవి రాజకీయ నాయకుడి లక్షణాలన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

జగన్ సీతయ్య అని.. ఆయన ఎవరి మాటా వినడని ప్రతీతి. తాను చెప్పింది ప్రతి ఒక్కరూ చేయాలని, మరొకరు చెప్పింది జగన్ ఆచరించరని ఆ పార్టీ నేతలు కూడా చెబుతారు. ఇప్పటి వరకు వైసీపీ రాజకీయంగా దెబ్బ తినడానికి కూడా ఇదే కారణమని కూడా చెబుతుంటారు. జగన్ అడిగినప్పుడు ఇక, ఆ పార్టీ నేతలు కూడా చక్కగా ఇంకా చెప్పాలంటే సూపర్ గా స్పందించారు. శవ యాత్రలు కాకుండా ప్రజా సమస్యలపై పర్యటించాలని సూచించారు. నిజానికి ఎవరైనా చనిపోతేనే జగన్ వెళతాడనేది ఇప్పటి వరకూ రూఢీ అయిపోయిన వాస్తవం. ప్రజలంతా ఆయనను ఓదార్పు జగన్ గానే చూస్తున్నారు. ఇకనైనా ఆయన ఆ ముద్రను మార్చుకుంటాడో లేడో చూద్దాం.

ఇక, జగన్ బాడీ లాంగ్వేజీ గురించి ఆ పార్టీ నేతలు ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. నాయకుడి లక్షణాలు మరీ ముఖ్యంగా మాన్లీ నెస్ ఆయనలో ఉండదనేది చాలామంది ఆరోపణ. బాధితులను కలిసినప్పుడు ఆయన ఎంతో జాలిగా ముఖం పెడతారని, మిగిలిన సందర్భాల్లో కూడా ఇదే విధంగా ఉంటారని చెబుతూ ఉంటారు. పార్టీ నాయకులు ఎవరూ చెప్పకపోయినా ప్రజలు తనను చూసే విధానాన్ని జగన్ మార్చుకోవడం కూడా ఆయనకు తక్షణావసరం.

అయితే, రాజకీయ నాయకుడు సలహాలు అడుగుతాడు కానీ వాటిని పాటించడని నానుడి. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన జగన్ సలహాలు అడిగాడు. మారాలా అని ప్రశ్నించాడు. వాస్తవానికి ఆ సలహాలను పాటిస్తే రాజకీయ నాయకుడు అవ్వడని కూడా అంటారు. మరి జగన్ ఏం చేస్తాడో చూద్దాం.