Begin typing your search above and press return to search.

జగన్ పై ఆరోపణల విలువ తగ్గించేసిన లక్ష్మినారాయణ!

By:  Tupaki Desk   |   24 April 2019 4:28 AM GMT
జగన్ పై ఆరోపణల విలువ తగ్గించేసిన లక్ష్మినారాయణ!
X
ఇన్ని రోజులూ మాటెత్తితే 'లక్ష కోట్లు' దోచుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపిస్తూ వచ్చారు ఆయన వ్యతిరేకులు. ప్రత్యేకించి ఆ ఆరోపణల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉందనేది తెలిసిన సంగతే. తెలుగుదేశం పార్టీ పదే పదే అలా ఆరోపించే సరికి.. ఆ మాట ఎక్కడి వరకూ వెళ్లిందంటే - ఆఖరికి సినిమాల్లో కూడా 'లక్ష కోట్లు' మాట బాగా పాపులర్ అయ్యింది.

అనేక సినిమాల్లో ఆ మాటను ఉపయోగించుకొంటూ వచ్చారు. జగన్ పై కేసులు నమోదు కావడం - అభియోగాలు నమోదు కావడంతో 'లక్ష కోట్ల'వాదనకు మరింత ఊపు వచ్చింది. అది జనాల్లోకి అలా వెళ్లిపోయింది. అయితే ఆ వాదనను నమ్మింది కొందరే. అందరూ నమ్మితే జగన్ పార్టీ అలా నిలదొక్కుకునేది కాదు.

ఇలాంటి నేపథ్యంలో జగన్ కేసులపై విచారణను మొదలుపెట్టిన మాజీ ఐపీఎస్, అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'లక్ష కోట్ల' ఆరోపణలపై స్పందించారు. ఈయన జనసేన పార్టీ నేత అయినప్పటికీ, ఆ పార్టీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉన్న రాజకీయ నేత అయినప్పటికీ.. జగన్ పై నమోదైన అభియోగాల విలువ గురించి సూటిగా చెప్పారు.

'లక్ష కోట్ల' మాట కేవలం రాజకీయ పరమైన ఆరోపణే అని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తమకు ఉన్న ఎవిడెన్స్ మేరకే చార్జిషీట్ ను పొందు పర్చినట్టుగా ఆయన వివరించారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం అయితే మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలపై అభియోగాలు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు.

లక్ష కోట్లు అంటూ ఎవరో రాజకీయంగా ఆరోపణలు చేస్తే దానికి తాము ఏం చేయగలిగింది లేదని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. ఇలా లక్ష కోట్ల రూపాయల ఆరోపణలను పదిహేను వందల కోట్ల రూపాయలకు తెచ్చారు ఈ సీబీఐ మాజీ జేడీ. మరి వారు నమోదు చేసిన అభియోగాల్లో కూడా కొన్ని వీగిపోయాయనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.