Begin typing your search above and press return to search.

జోన్ చాలా చిన్న విష‌య‌మా జేసీ?

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:32 AM GMT
జోన్ చాలా చిన్న విష‌య‌మా జేసీ?
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఏపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిని చెప్పాలి. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నా.. జేసీ కార‌ణంగా ఏపీకి ఏమైనా ఒరిగిందా? అంటే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లేన‌ని చెప్పాలి. తానున్న పార్టీ అధినేత‌పై బోల్డ్ గా మాట్లాడ‌టం.. వివాదాల‌కు తెర తీయ‌టం మిన‌హా.. ఆయ‌న‌కు ఆయ‌న సాధించిందేమీ లేద‌ని చెప్పాలి.

వ్యాపారాల్ని రాజ‌కీయాల్ని క‌ల‌గ‌లిపి.. త‌న వ్య‌క్తిగ‌త ప‌ర‌ప‌తిని.. ఆర్థిక వ‌న‌రుల్ని పెంచుకున్నార‌ని చెప్పే జేసీలాంటోళ్లు ఏమీ చేయ‌రు.. ఒక‌వేళ ఎవ‌రైనా ఏదైనా చేస్తున్నారంటే తీసి పారేస్తుంటారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ న‌ష్ట‌పోయిన విష‌యాన్ని చెప్పి.. కేంద్రం నిధులు తీసుకురావ‌టం సాధ్యం కాద‌ని తేల్చి పారేస్తారు. తెలంగాణ రాదంటే రాద‌ని బ‌ల్ల‌గుద్దినోళ్లు ఎంతోమంది ఉన్నా.. సాధిస్తామ‌న్న న‌మ్మ‌కంతో పోరాడిన కేసీఆర్ తీరుకు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం జేసీది. ఏ విష‌యంలోనైనా ఇట్టే తీసిపారేసే ఆయ‌న తాజాగా రైల్వే జోన్ విష‌యం చాలా చిన్న‌ద‌ని కొత్త త‌ర‌హా వ్యాఖ్య చేశారు.

నిజంగా జోన్ అన్న‌ది చిన్న అంశ‌మే అయితే.. దాన్ని సాధించ‌టం కోసం ఎంత‌కంత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది..? దాన్ని ఇవ్వ‌టానికి కేంద్రం ఇంత‌గా సాగిదీస్తోంద‌న్న‌ది ఆలోచిస్తే.. జోన్ కార‌ణంగా ఎంతోకొంత మేలు ఏపీకి జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కానీ.. జేసీ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడ‌తారు.

ప్ర‌తిదీ తేలిగ్గా తీసిపారేసే ఆయ‌న తాజాగా రైల్వే జోన్ చిన్న విష‌య‌మ‌ని.. దాని వ‌ల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని తేల్చేశారు. ఏపీ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాత్రం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. బాబు అంటే మోడీకి ఈర్ష ఉంద‌ని.. అన్నీ ఇచ్చేస్తే రాజ‌కీయంగా ఎదుగుతాడ‌ని భ‌యంతోనే ఏపీకి ఏమీ ఇవ్వ‌టం లేద‌న్న వాద‌న‌ను వినిపించారు. మొత్తంగా జేసీ మాట‌లు చూస్తే.. అధినేత బాబు చెక్క భ‌జ‌న చేస్తూ.. ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లిగించే రైల్వే జోన్ చిన్న‌ద‌ని తేల్చ‌టం చూస్తే ఆయ‌న వ్యాఖ్య‌ల మ‌ర్మం ఇట్టే అర్థం కాక మాన‌దు. త‌న‌కు ప్ర‌జ‌ల కంటే అధినేత మ‌న‌సు దోచుకోవ‌ట‌మే ముఖ్య‌మ‌న్న జేసీ లాంటి నేత‌లు ఏపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తుంటే.. ఏపీ ఎప్ప‌టికి ఎద‌గ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.