Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ మొనగాడేనండోయ్..

By:  Tupaki Desk   |   26 July 2016 11:01 AM GMT
జేసీ ప్రభాకర్ మొనగాడేనండోయ్..
X
వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఖరితో వార్తల్లో నిలిచే ఏపీ నేతల్లో జేసీ బ్రదర్స్ గా చెప్పుకునే జేసీ దివాకర్ రెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డిలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విషయం ఏదైనా కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం వారికి చేతనైనంత బాగా మరెవరికీ రాదనే చెప్పాలి. అభిమానం వచ్చినా.. ఆగ్రహం వచ్చినా తట్టుకోవటం కష్టమే. ఇది సాదాసీదా జనాల నుంచి.. అధినాయకత్వం వరకూ వారిదే రూల్ ని ఫాలో అయిపోతుంటారు. తాజాగా జేసీ సోదరుడు.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారింది. తన ఇంట్లో బీరువా.. బీగం లేదంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ మాటలు ఆయన నోటి నుంచి ఎందుకొచ్చినట్లంటారా? ఆస్తులు.. అంతస్తులకు సంబంధించిన యవ్వారంలో ఆయనీ విషయాన్ని చెప్పుకొచ్చారు.

జేసీ బ్రదర్ చెప్పాడు కాబట్టి ఆయన దగ్గర ఏమీ లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. జేసీ సోదరులు మహా వీర సౌండ్. అనంత కష్టాలున్న అనంతపురం జిల్లాను రిప్రజెంట్ చేస్తున్నా.. వారికి స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా బోలెడన్ని వ్యాపారాలున్నాయ్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వ్యాపారుల్ని ఎంత బాగా చూసుకుంటారో.. అంతే లెక్కగా తాడిపత్రి మున్సిపాలిటీ యవ్వారాల్ని చూస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లోని ఏ మున్సిపాలిటీ లెక్క చూసినా మైనస్సే (అప్పులు) కానీ ప్లస్ అంటూ కనిపించదు. కానీ.. తాడిపత్రి లెక్క మాత్రం అందుకు భిన్నం.

తాడిపత్రి మున్సిపాలిటీ ఖాతాలో రూ.25కోట్ల నగదు ఉందట. అంతేకాదు.. తాడిపత్రిలోని వేస్ట్ వాటర్ ను సైతం వదలకుండా వినియోగించేలా ప్రభాకర్ రెడ్డి పనులు చేయించారని.. పచ్చదనం విషయంలో ఏపీకే తాడిపత్రి మున్సిపాలిటీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే పరిస్థితి. ఇలా తన అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు.. తన అడ్డాలోని బడా బడా వ్యాపారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఈ జేసీ బ్రదర్ ఏ రకంగా చూసినా మొనగాడేనని చెబుతున్నారు. అయినా.. జేసీ ప్రభాకర్ లాంటోడి ఇంట్లో బీరువాలు.. బీగాల అవసరం ఏముంది? ఎవరొచ్చి మాత్రం ఆయన్ను ఏం చేయగలుగుతారు? అందుకే కాబోలు అంత ధీమా బీరువా.. బీగాలు తనకు అవసరం లేదని చెప్పి ఉండొచ్చు.