Begin typing your search above and press return to search.

వార‌స‌త్వంలోనూ జేసీల బాటే వేరబ్బా!

By:  Tupaki Desk   |   12 July 2018 11:45 AM GMT
వార‌స‌త్వంలోనూ జేసీల బాటే వేరబ్బా!
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌ను - ప్రాంతాల‌ను ప‌క్క‌న‌బెడితే... ఏపీలో మాత్రం వార‌స‌త్వ రాజ‌కీయం ఉప్పెన‌లా పొంగే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న‌ది ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. అది కూడా విప‌క్ష వైసీపీలో కాకుండా అధికార పార్టీ టీడీపీలోనే ఈ త‌ర‌హా రాజ‌కీయం మ‌హా రంజుగా సాగ‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌య‌సు ఉడిగిపోయింద‌ని భావించే కొంద‌రు నేత‌లు... త‌మ స్థానాల్లో త‌న‌యుల‌ను రంగంలోకి దించేందుకు య‌త్నిస్తుండగా, ఇళ్లు ఉండ‌గానే దీపం చ‌క్క‌బెట్టుకోవాన్న త‌లంపుతో తాము రంగంలోనే ఉన్నా.. వార‌సుల‌ను కూడా రంగంలోకి దించేసి త‌మ‌దైన శైలి రాజ‌కీయాల‌కు మ‌రికొంద‌రు తెర తీశారు. ఈ క్ర‌మంలో తొలి కోవ‌కు చెందిన నేత‌లుగా జేసీ బ్ర‌ద‌ర్స్ ను చెప్పుకోవ‌చ్చు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతూ వ‌చ్చిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి - తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాకర్ రెడ్డి... ఇప్పుడు అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేస్తూ అన్నాద‌మ్ములు ఇద్ద‌రూ ఒకేసారి రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటున్నార‌ట‌.

ఈ మేర‌కు దివాక‌ర్ రెడ్డి ఇప్ప‌టికే ప‌లుమార్లు బ‌హిరంగంగానే త‌న రాజ‌కీయ స‌న్యాసాన్ని చెప్పేయ‌గా - ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇప్ప‌టిదాకా బ‌య‌ట‌ప‌డ‌కున్నా... తాను కూడా త‌న సోద‌రుడి బాట‌లోనే న‌డిచేందుకు దాదాపుగా సిద్ధ‌ప‌డిపోయార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేత‌లుగా, అంత‌క‌న్నా సిట్టింగ్ ఎంపీ - ఎమ్మెల్యేలుగా ఉన్న వీరిద్ద‌రికీ ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న విష‌యం ఇప్పుడు ఏ ఒక్క‌రికి కూడా అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. మ‌న‌సులో ఉన్న మాట‌ను నిర్మోహ‌మాటంగా బ‌య‌ట‌కు చెప్పేయ‌డంలో జేసీ బ్ర‌ద‌ర్స్ దిట్ట‌ల‌నే చెప్పాలి. ఎదుటి వ్య‌క్తి ఏమ‌నుకుంటార‌న్న విషయాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోని జేసీ బ్ర‌ద‌ర్స్‌... త‌మ నోట నుంచి బూతులు బ‌య‌ట‌కు వ‌స్తున్నా కూడా ఏమాత్రం సిగ్గుప‌డ‌రు. అస‌లు తాము మాట్లాడుతున్నది మీడియాతోనా? లేదంటే కార్య‌క‌ర్త‌ల‌తోనా? అన్న విష‌యంతో పాటు అస‌లు తాము ఇంటిలో ఉన్నామా? బ‌య‌ట ఉన్నామా? అన్న విష‌యాన్ని కూడా వారు ఏమాత్రం ప‌ట్టించుకోరు. మొత్తంగా కాస్తంత ఇబ్బందిక‌ర‌మైన వ్య‌వ‌హార స‌ర‌ళితో నిత్యం వార్త‌ల్లో ఉండే జేసీ బ్ర‌ద‌ర్స్‌... ఉన్న‌ప‌ళంగా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటున్నార‌న్న వార్త నిజంగానే ఆస‌క్తి క‌లిగించేదే.

జేసీ బ్ర‌ద‌ర్స్‌గా జ‌నాల‌కు తెలిసిన దివాక‌ర్‌ - ప్ర‌భాక‌ర్ రెడ్డిలు రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించినా... జేసీ బ్ర‌ద‌ర్స్ మాట మాత్రం క‌నుమ‌రుగు కాద‌ట‌. ఎందుకంటే... జేసీ బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయం నుంచి స‌న్యాసం తీసుకుంటున్నా... వారి స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు జేసీ పవ‌న్ రెడ్డి - జేసీ అస్మిత్ రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయిన ప‌వ‌న్‌ - అస్మిత్ లు త‌మ తండ్రుల మాదిరే తాము కూడా సత్తా చాట‌గ‌లమంటూ ఇప్ప‌టికే ప‌లు మార్లు మీడియా ముందుకు కూడా వ‌చ్చేశారు. జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడైన ప‌వ‌న్ రెడ్డి త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అనంత‌పురం పార్ల‌మెంటు నుంచి - జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌యుడైన అస్మిత్ రెడ్డి త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంట్రీ ఇస్తార‌న్న వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. గెలుపు - ఓట‌మి అన్న విష‌యాల‌ను ప‌క్క‌న‌బెడితే... జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గానే కాకుండా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌నిచేసిన జేసీ నాగిరెడ్డి వార‌స‌త్వాన్ని జేసీ దివాక‌ర్‌ - ప్ర‌భాక‌ర్ లు కొన‌సాగించిన మాదిరి... ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్స్ వార‌స‌త్వాన్ని ప‌వ‌న్‌ - అస్మిత్‌ లు కొన‌సాగిస్తారా? అన్న‌ది ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తున్న ప్ర‌శ్న‌.