జగన్ అంత మగాడా అంటున్న జేసీ

Wed Jan 11 2017 22:13:39 GMT+0530 (IST)

అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గతంలో వలే జేసీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పులివెందులలో సీఎం చంద్రబాబు హాజరైన సభలో జేసీ మాట్లాడుతూ జగన్ ను సొంత ఇలాకాలోనే ఓడించాలని పిలుపునిచ్చారు.  తాను వైసీపీ అధినేత జగన్‌ను ఆప్యాయంగా వాడు అని పిలిచానని - అలా పిలిచినా తప్పేనా అని జేసీ మండిపడ్డారు. జగన్ కు ఏం తెలుసని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరో చెబితే మాట్లాడే జగన్ కు - ఆయనకు చెప్పే వారికి కూడా ఏం తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ కు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే తాత గుణాలు ఒంటబట్టాయని జేసీ వ్యాఖ్యానించారు.

తాత వారసత్వం పుణికిపుచ్చుకున్న జగన్ తమ సొంత ఇలాకా అయిన  పులివెందులలో మళ్లీ రక్తపాతం సృష్టించద్దని జేసీ దివాకర్ రెడ్డి హితవు పలికారు. "రాజారెడ్డికి తెలిసిన చెయ్యి నరకడం తల నరకడం కాలు నరకడం వంటి బుద్ధులే జగన్ కు ఉన్నాయి. అందుకే మా జిల్లాలో ఉన్న తాడిపత్రికి అలాంటి వ్యక్తిని పార్టీ ఇంచార్జిగా పెట్టాడు. అంటే మళ్లీ గొడవలు రేపాలని చూస్తున్నాడు. రక్తపాతాన్ని అందరూ మర్చిపోగా...జగన్ మళ్లీ రక్తపాతం రేపేందుకు వస్తున్నాడు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో అందరూ రెడ్లేనని ఎవరూ టీడీపీకి ఓటేయలేదని ఇప్పుడు నీళ్లివ్వడంతో 2019లో అందరూ ఓటేయాలని పులివెందులలో జగన్‌ను ఓడించాలని జేసీ సూచించారు. తాను కల్తీ రెడ్డిని కాదని జగన్ కల్తీ రెడ్డి అని జేసీ అభిప్రాయపడ్డారు. కులం వర్గం అంటుంటే లాభం లేదని  రెడ్లు అయినా ఎవరైనా నీళ్లు ఇవ్వాలని పేర్కొంటూ అందుకే చంద్రబాబు పులివెందులకు నీరు ఇవ్వాలని ఎంత ఖర్చుకు అయినా వెనుకాడకుండా ముందుకు సాగారని జేసీ వ్యాఖ్యానించారు.

కాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పైనా జేసీ మండిపడ్డారు. తనను జగన్ చెంచాగాళ్లు బూట్లు నాకేవాడు అన్నారని తాను అదే చేసేవాడిని అయితే ఎప్పుడో మంత్రిని అయ్యేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనకు తాగే అలవాటే లేకపోగా....తనను జానీవాకర్ అని అంటున్నారని   చెప్పారు. నాలుక చీస్తానని అంటున్నావని అంత మగాడివా అని శ్రీకాంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. తన పైన విమర్శలు చేస్తున్నారని మీ ఊరికి వస్తానని దమ్ముంటే నన్ను ముట్టుకోవాలని జేసీ సవాల్ చేశారు. అప్పుడు నీ కథ తెలుస్తుందన్నారు. 'ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు' అంటూ జేసీ నిప్పులు చెరిగారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/