Begin typing your search above and press return to search.

బాబు గుండెల్లో రాజీనామా బండేసిన జేసీ

By:  Tupaki Desk   |   21 Sep 2017 11:17 AM GMT
బాబు గుండెల్లో రాజీనామా బండేసిన జేసీ
X
త‌న మాట‌ల‌తో త‌ర‌చూ సంచ‌ల‌నాలు సృష్టించే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జేసీ.. కరువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లాకు నీళ్లు అందించ‌లేక‌పోతున్నాన‌ని, త‌న‌ను న‌మ్మి ఓటు వేసిన ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోతున్నందువ‌ల్లే రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పారు. ఎంపీగా తానేం చేయ‌లేక‌పోతున్న‌ట్లుగా చెప్పి త‌న రాజీనామా ప్ర‌క‌ట‌న చేయ‌టం ద్వారా బాబు గుండెల్లో బండేశార‌ని చెప్పాలి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు తీసుకొస్తాన‌ని చెప్పి.. ఆ ప‌ని చేయ‌లేద‌న్న ఆయ‌న అనంత‌పురం అభివృద్ధికి కొన్ని శ‌క్తులు అడ్డు త‌గులుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మేలు కోసం ప‌నికి రాని ప‌ద‌వి త‌న‌కు అక్క‌ర్లేదన్న ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నారు. సోమ‌వారం ఢిల్లీకి వెళ్లి త‌న రాజీనామాను స్పీకర్ కు స‌మ‌ర్పించ‌నున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు.

నాలుగు ద‌శాబ్దాలు రాజకీయాల్లో ఉన్న జేసీ.. ఈ మొత్తం కాలంలో త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏం చేశార‌న్న విష‌యం అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. ప్ర‌జ‌ల పేరుతో జేసీ రాజ‌కీయాలు కొత్త కాకున్నా.. ఉన్న‌ట్లుండి రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న జేసీకి ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది రాజకీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

ఏ పార్టీలో ఉండే ఆ పార్టీకి త‌న మాట‌ల‌తో సినిమా చూపించే ఆయ‌న‌.. బాబు మీద‌.. బాబు పాల‌న మీద ఆయ‌నెన్ని జోకులు వేశారో ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అధినేత‌ను నేరుగా తిట్టే సాహ‌సం చేయ‌లేని నేత‌ల‌కు భిన్నంగా.. జేసీ వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

పొగ‌డాల‌న్నా.. తిట్టాల‌న్న జేసీకి సాటి మ‌రెవ్వ‌రూ ఉండ‌ర‌నే చెప్పాలి. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో బాబుపై ప‌లుమార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీకి ఉన్న‌ట్లుండి ప్ర‌జ‌లు.. వారికి తాను చేయాల్సిన సేవ గుర్తుకు రావ‌టం ఆశ్చ‌ర్య‌మే. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో తాను ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని.. స్పీక‌ర్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నందున ఆమె రాగానే వెళ్లి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.

త‌న నాలుగు ద‌శాబ్దాల రాజకీయ జీవితంలో ఎవ‌రికి త‌ల వంచ‌లేద‌న్న జేసీ మాట‌లు ప‌క్క‌న పెడితే.. ఇంతకాలం రాజ‌కీయాల్లో ఉండి ఆయ‌న సాధించిందేమిట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. జేసీ పుణ్య‌మా అని బాబుకు బీపీ రావ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి. మొన్న‌టికి మొన్న జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి.. మందీ మార్బ‌లాన్ని దించి త‌న ఖాతాలో గెలుపు వేసుకున్న బాబుకు.. జేసీ రూపంలో వ‌చ్చిప‌డే ఉప ఎన్నిక చుక్క‌లు చూపించ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌రుస క‌ర‌వుతో అల్లాడిపోతున్న అనంత‌పురం రైతులు బాబు స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇలాంటి వేళ జేసీ త‌న రాజీనామాతో బాబుకు కొత్త చిక్కులు తెస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జేసీ రాజీనామా మాట నిజ‌మే అయి.. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తే ఆర్నెల్ల లోపు మ‌రో ఉప ఎన్నిక‌ను ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం బాబుకు ఎదుర‌వుతుంది. అదే జ‌రిగితే.. బాబుకు మ‌రో క‌ఠిన ప‌రీక్షేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కాలం త‌న మాట‌ల‌తో ఇబ్బంది పెట్టిన జేసీ.. త‌న చేత‌ల‌తో అంత‌కు మించిన ఇబ్బందిని సిద్ధం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.