జేసీ... యూటర్న్ రెడ్డి అయిపోయారే!

Sun Jun 24 2018 16:06:02 GMT+0530 (IST)

జేసీ దివాకర్ రెడ్డి... ఈ పేరు సంచలన ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా పరిణమించిన నేతగానే మనకు జేసీ గుర్తుకు వస్తారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ... కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వాలను చాలా సార్లు ఇబ్బందులకు గురి చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జేసీ వైఖరిలో పెద్దగా మార్పు కనిపించేది కాదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం తనదైన రాయలసీమ స్లాంగ్‌లో మీడియాకు జనాలకు విందైన పద ప్రయోగం చేయడం జేసీకి మాత్రమే చెల్లుతుంది. ఈ క్రమంలో తన నోటి నుంచి బూతు పదాలు దొర్లినా కూడా ఏమాత్రం తడబాటు లేకుండా... మేం ఇలాగే మాట్లాడుకుంటామంటూ ఏకంగా మీడియా ప్రతినిధులకే క్లాస్ పీకేసే జేసీ... తాను ఆరోపణలు గుప్పిస్తున్నది సొంత పార్టీ వారిపైనా - విపక్ష పార్టీ నేతలపైనా అన్న స్పష్టత పూర్తి స్థాయిలో ఉన్నా కూడా తాను అనుకున్నది నాన్ స్టాప్‌గా మాట్లాడేస్తారు. మొత్తంగా జేసీ నోరు తెరుస్తున్నాంటే వైరి వర్గాల మాట అలా పక్కన పెడితే... సొంత పార్టీ వారిలో మాత్రం బీపీ పెరిగిపోవడం ఖాయమే.అయినా ఇప్పుడు జేసీ గురించి ఇంతగా చెప్పుకోవాడానికేముందంటే?... కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఓ నాలుగు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కదా. దీ దీక్షకు మద్దతు పలికేందుకు మొన్న కడపకు వెళ్లిన జేసీ... సీఎం రమేశ్ దీక్షకు మద్దతు పలికినట్టే పలికి టీడీపీకి పెద్ద దెబ్బ కొట్టేశారు. సీఎం రమేశ్ ఎన్ని దీక్షలు చేసినా కడప ఉక్కు ఫ్యాక్టరీ రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ... *ఉక్కు రాదు తుక్కు రాదు* అంటూ తనదైన శైలి కామెంట్లు చేశారు. రాని ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ సీఎం రమేశ్ కు జేసీ ఉచిత సలహా పడేశారు. మొత్తంగా అప్పటిదాకా సీఎం రమేశ్ దీక్షపై టీడీపీ నేతలు కొంతలో కొంతైనా ఏదో చేసి చూద్దాం అంటూ ముందుకు సాగినా... జేసీ వ్యాఖ్యలతో ఆ కొద్దిపాటి ఉత్సాహంపై నీళ్లు చ్లలినట్టైంది. అయితే టీడీపీ అంటే... జేసీ సీఎం రమేశ్లు మాత్రమే కాదు కదా. సీఎం రమేశ్ సొంత జిల్లాకు చెందిన జంపింగ్ మంత్రి ఆదినారాయణరెడ్డి సహా పలువురు బాబు కేబినెట్ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు జేసీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కడప ఉక్కు కోసం పార్టీ ఎంపీ హోదాలో సీఎం రమేశ్ చేస్తున్న దీక్షపై బాధ్యత కలిగిన ఎంపీ స్థానంలో ఉండి జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... పార్టీ పరువేంగానూ అంటూ కాస్తంత బహాటంగానే తమ అసంతృప్తిని పార్టీ శ్రేణులు వెళ్లగక్కాయట.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు తాను చేసిన కొన్ని  సంచలన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయడం తాను వివరణ ఇచ్చుకోవడాన్ని గుర్తు చేసుకున్న జేసీ... ఈ సారి అధిష్ఠానం నుంచి కబురు రాకముందే తేరుకున్నారట. వెంటనే మాట మార్చేశారట. దీక్షలు చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని మాత్రమే సీఎం రమేష్‌కు చెప్పానని జేసి   చాలా సింపుల్ గా మాట మార్చేశారు. అంతేగానీ దీక్షలు చేయవద్దని తాను అనలేదని కూడా ఆయన తన మాటలను తానే ఖండించేసున్నారు. అయినా మాట మార్చడంలో తనను మించిన వారు లేరంటూ చాలా సింపుల్ గా మాట మార్చేయడంతో పాటు విపక్షాలతో యూటర్న్ అంకుల్ అని పేరు పెట్టించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న జేసీ... పార్టీలో తాను కూడా యూటర్న్ అంకుల్‌నే అంటూ తనకు తానే ఓ కొత్త పేరు పెట్టించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జేసీ... ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కొందరు జనాలు ఆయనను యూటర్న్ రెడ్డిగానూ అభివర్ణిస్తున్నారు. మొత్తంగా గతంలోనూ చాలా సార్లు మాట మార్చేసిన జేసీ... ఈ  సారి మాత్రం ఏకంగా తన పేరునే యూటర్న్ రెడ్డిగా మార్చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.