వైసీపీ నేతలపై జేసీ వర్గం దాడులు

Sun Nov 19 2017 15:51:53 GMT+0530 (IST)

అనంతపురంలో జేసీ బ్రదర్స్ కు ఉన్న ప్రాబల్యం అంతా ఇంతా కాదు. తమ మాటే నెగ్గాలి. తాము చెప్పినట్టే ప్రజలు నడవాలి. అనే రేంజ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి హవా చలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు విపక్షం వైసీపీ నేతలపై తరచుగా దాడులకు కూడా తెగబడుతున్నారు. తాజాగా ఆదివారం జేసీ వర్గానికి చెందిన కొందరు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి.. తమ మాట వినలేదనే అక్కసుతో.. ఆయా ఇళ్లను కూల్చివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే రేంజ్ లో పరిస్థితి మారిపోయింది.విషయంలోకి వెళ్తే.. ఇటీవల అనంతపురంలో దారుణహత్యకు గురైన వైఎస్ ఆర్ సీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి కేసులో టీడీపీ నేతలు ముఖ్యంగా జేసీ బ్రదర్స్ వర్గానికి చెందిన వారి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులో రాజీకి రావాలని జేసీ వర్గం నేతలు.. వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారట. అయితే దీనిని వైసీపీ నేతలు  ససేమిరా అంటున్నారు. అంతేకాదు.. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని అంటున్నారట. దీంతో జేసీ వర్గానికి చెందిన నేతలు.. వైసీపీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు.  హత్య విషయంలో రాజీ పడాలంటూ తమకు పలుమార్లు బెదిరింపులు వచ్చినట్లు  వైసీపీ నేతలు తెలిపారు.

ఇక ఈ క్రమంలోనే ఆదివారం జేసీ వర్గం వైసీపీ నేతల ఇళ్లపై విరుచుకుపడింది. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఆదివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై  జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆక్రమణల తొలగింపు పేరుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందిన ఐదు ఇళ్లను కూల్చి వేశారు. అనంతరం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవసాయ క్షేత్రాల్లో విధ్వంసం సృష్టించారు. హంతకులకు వ్యతిరేకంగా సాక్షం చెప్తామనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇదిలావుంటే జేసీ కార్యకర్తలు తమ ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపించడం గమనార్హం. ఏదేమైనా.. వైసీపీ నేతలపై జరుగుతున్న అకృత్యాలకు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.