Begin typing your search above and press return to search.

ఆశపడుతున్న వేళ.. ఎంపీగారి అపశకునాలు!

By:  Tupaki Desk   |   23 Feb 2018 10:51 AM GMT
ఆశపడుతున్న వేళ.. ఎంపీగారి అపశకునాలు!
X
‘శుభం పలకరా పంతులూ’ అంటే.. ‘ఆ పెళ్లికూతురు ముండను ఇలా తీసుకురండి’ అని వెనకటికి ఎవరో అన్నార్ట.

ఆ సామెత చందంగా పుల్లవిరుపు మాటలు మాట్లాడడంలో.. సమకాలీన రాజకీయాల్లో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని మించిన వారు లేరు. ఎంపీ పదవులు ఎందుకూ పనికిరాకుండా పోయాయని తరచూ పెదవి విరిచినా, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అసలు ప్రజాప్రతినిధి అనే పదానికే విలువ లేకుండాపోయిందని.. చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దానికి ఎలాంటి ఫలితమూ దక్కదని .. ఇలా రకరకాల నిరాశాజనకమైన మాటలను ఆయన తరచూ చెబుతుంటారు.

ఒకవైపు రాష్ట్రం విభజన హామీలకు నోచుకోకుండా - బడ్జెట్ హామీలకు కూడా నోచుకోకుండా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ.. మనకు రావాల్సినవి అన్నీ సాధించుకోవడం ఎలా అంటూ అందరూ మధనపడుతున్న సమయం ఇది. అవిశ్వాసం పెట్టాలా రోడ్డెక్కి పోరాడాలా అనే ఆలోచనలు నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రత్యేకహోదా డిమాండును తానుకూడా వినిపించడం ప్రారంభించారు.

ఇలాంటి సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ప్రజల్లో ఉన్న ఉత్సహాన్ని కూడా నీరుగార్చేవిధంగా - ఆశలపై నీళ్లు చిలకరించే విధంగా మాట్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు ప్రత్యేకహోదా గానీ - ప్యాకేజీ గానీ ఏదీ రాదని ఆయన అంటున్నారు. ఈ రెండు విషయాల్లోనూ మోడీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా అయితే ప్రస్తుతం చేస్తున్న ఒత్తిడిని రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ మార్చిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో కూడా పట్టువిడవకుండా కొనసాగిస్తే.. మీడియా కూడా మద్దతిస్తే కొంత మేర రాష్ట్రానికి నిధులు దక్కే అవకాశం మాత్రమే ఉన్నదని జేసీ జోస్యం చెబుతున్నారు.

కేంద్రంనుంచి ఏపీకి ఏమీ వచ్చే అవకాశం లేదని.. పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పేస్తున్నారు. మరి.. తెలుగుదేశం తతిమ్మా ఎంపీలు ఏదో సాధించేస్తాం అన్నట్లుగా ఎందుకు చెబుతున్నారో అర్థం కాని సంగతి.

అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం.. ఈసారి జేసీ మాట దాటవేశారు. జగన్ పేరెత్తితే.. విమర్శలతో విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు అవిశ్వాసం పెట్టబోతున్నాం.. అంటూ వైసీపీ నిర్దిష్టంగా పోరాటం చేస్తుండేసరికి.. ఆ పార్టీ విషయంలో తనకు స్పష్టత లేదంటూ దాటవేయడం విశేషం.