Begin typing your search above and press return to search.

మోడీ మెడ‌కోసినా ఏపీకి న్యాయం జ‌ర‌గ‌దు:జేసీ

By:  Tupaki Desk   |   17 April 2018 8:29 AM GMT
మోడీ మెడ‌కోసినా ఏపీకి న్యాయం జ‌ర‌గ‌దు:జేసీ
X
స్వ‌ప‌క్షం - విప‌క్షం అన్న తేడా లేకుండా నిర్మొహ‌మాటంగా మాట్లాడ‌డం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి నైజం. ఇప్ప‌టికే చాలాసార్లు త‌మ పార్టీ నేత‌లపై....కొన్ని సంద‌ర్భాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై కూడా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం జేసీకి మాత్ర‌మే సాధ్యం. చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేయ‌డం జేసీ మేన‌రిజం. కొద్దిరోజుల క్రితం....అపార అనుభ‌వం - నేర్పు - చ‌తుర‌త ఉండ‌డం వ‌ల్ల చంద్ర‌బాబు..... ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ అవుతాడ‌నే ఉద్దేశంతోనే మోదీ..చంద్ర‌బాబుపై కోపం పెంచుకున్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా, ఆయ‌న మ‌రో సారి ప్ర‌ధాని పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ మెడ తెగ్గోసినా నవ్యాంధ్రకు న్యాయం చేయరని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి ఏమీ చేయరని వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల‌పై జేసీ త‌న‌దైన శైలిలో జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీనే అతిపెద్ద పార్టీ అవుతుంద‌ని, అయితే, మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవ‌కాశాల గురించి ఇప్పుడే మాట్లాడ‌లేమ‌న్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రులు అవడం ఖాయమన్నారు. ఏపీకి 19 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్య‌లు అబ‌ద్ధ‌మ‌ని చెప్పారు. వైసీపీ నేత జగన్‌ - జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ లను కలపాలని కొందరు ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌వుతుంద‌ని జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వెళ్ల‌డం పిచ్చిత‌న‌మ‌ని విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల‌నుద్దేశించి అన్నారు. టీడీపీలో టికెట్లు రానివారు వైసీపీలోకి వెళ్తార‌న్నారు. మర్యాదపూర్వకంగా పలకరిస్తే టచ్ లో ఉన్నట్లు కాద‌ని, తాను కూడా విజ‌య‌సాయిరెడ్డితో క‌లిసి కాఫీ తాగామని...అంత మాత్రాన టచ్‌ లో ఉన్నట్లేనా?...అని ప్ర‌శ్నించారు. ఇటువంటి వ్యాఖ్య‌ల‌ను విజ‌య‌సాయిరెడ్డి మానుకోవాలని సూచించారు.