Begin typing your search above and press return to search.

‘నీమో-నమో’ బంధాన్ని మన పెద్దాయన వదల్లేదు!

By:  Tupaki Desk   |   18 Feb 2018 1:30 PM GMT
‘నీమో-నమో’ బంధాన్ని మన పెద్దాయన వదల్లేదు!
X
ప్రధాని మోడీ అయినా సరే.. తన సొంత పార్టీ అధినేత చంద్రబాబు అయినా సరే.. ఇంకా ఎంత పెద్ద హోదా వారైనా సరే.. తాను విమర్శించదలచుకుంటే.. ఆయన ఎన్నడూ వెనకా ముందూ చూడరు. అంత పెద్ద వారిమీద ఒక మాట అనేయడం బాగుంటుందా అనే ఆలోచన కూడా ఆయనకు ఎన్నడూ రాదు. తెలుగు నాయకుల్లో అలాంటి దూకుడైన స్టేట్ మెంట్లకు కేరాఫ్ ఎడ్రస్ అయిన నాయకుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి! ఆయన గతంలో ఎన్నిసార్లు మోడీని ఓపెన్ గా విమర్శించారో లెక్కేలేదు. మోడీ జమానాలో.. ఎంపీలకు విలువ లేకుండా పోయిందని ఆయన అంటుంటారు. అలాంటి జేసీ ఇప్పుడు నరేంద్రమోడీ.. 17వేల కోట్లు దోచుకుని పారిపోయిన నీరవ్ మోడీని వదలి.. ఏపీకి అన్యాయం చేశారంటూ కొత్త విమర్శలు షురూ చేశారు.

నిజానికి నీరవ్ మోడీ పారిపోయిన నాటినుంచి.. ‘ఛోటా మోడీ’ అంటూ మీడియా ఆయన గురించి విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ వ్యాఖ్యలపై భాజపా కూడా తీవ్రస్థాయిలో మండిపడిన సంగత తెలిసిందే. ఛోటా మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ – భాజపా మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం కూడా నడిచింది. ఒకవైపు పత్రికల్లో మాత్రం నీమో-నమో బంధం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేశాయి. ఇటీవలి దావోస్ కార్యక్రమంలో నమోతో నీమో కూడా ఫోటో దిగడంతో ఆరోరపణలు పెరిగాయి. ప్రధానితో దావోస్ వెళ్లిన బృందంలో నీరవ్ మోడీ కూడా ఉన్నాడంటూ ఆరోపణలు రావడంతో.. ఆయన తమ బృందంలో లేడని, విడిగా వచ్చాడని పీఎంఓ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. మీడియా గా వారు చేసే విమర్శలన్నీ ఒక ఎత్తు.. మిత్రపక్షం తెలుగుదేశానికి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా.. నీమోతో- నమో అనుబంధం ఉన్నదంటూ.. వ్యాఖ్యలు చేయడం మరో ఎత్తు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను భాజపా దళాలు సీరియస్ గా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జేసీ దివాకర్ రెడ్డి ప్రధానిపై విమర్శలతో పాటూ.. తన సహజశైలిలో ప్రత్యేకహోదా విషయంలో కూడా.. అపశకునాలు పలుకుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చే అవకాశమే లేదని, మహా అయితే ప్యాకేజీ మాత్రమే దక్కుతుందని ఆయన అంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా ప్రధాని మోడీకి - నీరవ్ మోడీకి గల సంబంధాలు గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తొలినుంచి ఈ ఆరోపణలు చేస్తూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులు నమోకు నీమో తో బంధం అంటగట్టేస్తూ ముప్పేట దాడికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.