Begin typing your search above and press return to search.

జీఈఎస్‌ పై ఇవాంకా చేసిన తాజా ట్వీట్!

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:50 PM GMT
జీఈఎస్‌ పై ఇవాంకా చేసిన తాజా ట్వీట్!
X

హైదరాబాద్‌ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ముగిసి దాదాపు 14 రోజులు పూర్త‌యిన‌ప్ప‌టికీ...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య‌ - ఆయ‌న సలహాదారు ఇవాంకా ట్రంప్ మ‌దిలో నుంచి ఇండియా టూర్ తొల‌గిపోన‌ట్లు ఉంది. హైదరాబాద్‌ లో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఈవెంట్‌ కు అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైన సంగ‌తి తెలిసిందే. జీఈఎస్ ముగిసి రెండు వారాలు పూర్త‌యిన త‌ర్వాత‌ మంగళవారం ఇవాంకా తాజాగా ఓ ట్వీట్ చేశారు.

హైద‌రాబాద్‌ లో జ‌రిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. జీఈఎస్ సదస్సులో సుమారు 1200 మంది చురుకైన వ్యాపారవేత్తలతో సహా తమ దేశానికి చెందిన 350 మంది పాల్గొన్నట్లు ఇవాంకా ఆ ట్వీట్‌ లో తెలిపారు. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోడీ - భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ఆమె ఆ ట్వీట్‌ లో పేర్కొన్నారు.అయితే ఆ ట్వీట్‌ లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని వాడారు. ఆ ట్వీట్‌ ను సుమారు 1500 మంది భారతీయులు - ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్‌ ను రీట్వీట్ చేశారు.

కాగా, జీఈఎస్‌ లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నదని ఇవాంకా ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్‌ ఫోర్స్ - స్కిల్ డెవలప్‌ మెంట్ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. తమ కలలను తమ భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. చాలా గొప్ప పని చేశావంటూ తన సలహాదారు - కూతురు అయిన ఇవాంకాను డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. `గ్రేట్‌ వర్క్ ఇవాంకా` అంటూ ఆయన ట్వీట్ చేశారు.