Begin typing your search above and press return to search.

ప‌వ‌న్...నువ్వెక్క‌డ‌?

By:  Tupaki Desk   |   28 Aug 2015 8:10 AM GMT
ప‌వ‌న్...నువ్వెక్క‌డ‌?
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ ? అదేంటి...మొన్నే క‌దా రాజ‌ధాని భూ సేక‌ర‌ణ‌లో రైతుల‌కు అన్యాయం చేయ‌వ‌ద్దంటూ ప‌వ‌న్ డిమాండ్ చేశారు. ఇంత‌లోనే ప‌వ‌న్ ఎక్క‌డా అంటూ ప్ర‌శ్నించ‌డం ఏమిట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాను అన్న ప‌వ‌న్ సంద‌ర్భాన్ని బట్టికాకుండా...అన్ని విష‌యాల్లోనూ తాపీగా నిర్ణ‌యం తీసుకొని... అనంత‌రం రియాక్ట్ అవ‌డం ఏమిట‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ ప్రారంభ‌మైంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వంలో గ‌ద్దెనెక్కిన త‌ర్వాత నాన్చ‌డం మొద‌లుపెట్టింది. కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌త్యేక హోదా లేద‌ని తేల్చింది. అదే స‌మ‌యంలో బీహార్‌ కు భారీ ప్యాకేజీ ఇచ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలని కోరగా.....మోడీ నో చెప్పార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. క‌నీసం భారీ ప్యాకేజీ కోరినా...దానికి మోడీ సై అన‌లేదని స‌మాచారం. ఆర్థిక‌మంత్రి జైట్లీ పొడిపొడిగా స్పందించి విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వాటిని నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం స్మార్ట్ సిటీల జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కేవ‌లం మూడే న‌గ‌రాలను కేంద్రం ఎంపిక చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కేవ‌లం మూడే న‌గ‌రాల‌ను ఎంపిక‌చేయ‌డం ఏమిట‌ని ఆంధ్రా అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాన్చి నాన్చీ న‌ట్టేటా ముంచార‌ని..అలాగే స్మార్ట్ సిటీల విష‌యంలోనూ మొక్కుబ‌డిగా ఎంపిక‌చేశార‌ని ప్ర‌స్తావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ నేరుగా ప్ర‌శ్నించాల‌ని కోరుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అన్యాయం జ‌రిగితే తాను స్పందిస్తాన‌న్న ప‌వ‌న్ వెంట‌నే ఈ విష‌య‌మై మీడియాతో మాట్లాడ‌టం లేదా బీజేపీ పెద్ద‌ల‌ను సంప్ర‌దించాల‌ని కోరుతున్నారు. అలా కాని ప‌క్షంలో ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్‌ను అయినా వేదిక‌గా చేసుకొని ఆంధ్రుల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.