Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అతిపెద్ద మతం.. నేడు, రేపు!

By:  Tupaki Desk   |   30 July 2016 4:27 PM GMT
ప్రపంచంలో అతిపెద్ద మతం.. నేడు, రేపు!
X
వర్ధమాన దేశాల్లో సంతానోత్పత్తి పెరుగుతోంది, సెక్యులర్ దేశాల్లో యువ జనాభా తరుగుతుంది.. వీటితో పాటు ఏ మతంలో సంతానోత్పత్తి శాతం ఎలా ఉంది, ఏ మతం నుంచి ఏ మతానికి మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి, వాటి సంఖ్య ఎంత? అనే అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రధాన మతాల పెరుగుదల, తరుగుదలలపై అమెరికాలోని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఓ అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనం ద్వారా అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

2010 జనాభాలెక్కలను పరిగణలోకి తీసుకున్న నిపుణులు.. 2050, 2070 నాటికి వచ్చే మార్పులపై వివరణ ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న అనేక మతాల్లో నేటివరకూ అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవ్యం, ఇస్లాం.. అదేవిధంగా రీలీజియన్ దేశాల్లోని మతాలు, వాటి మనుగడ.. భవిష్యత్తులో ఆయా మతాలలోని జనాభాలో వచ్చే మార్పు.. వంటి అంశాలపై ఈ అధ్యయనం ఇచ్చిన సమాచారం ఇలా ఉంది...

2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 31.4 శాతంతో అతిపెద్ద మతంగా ఆవిర్భవించిన క్రైస్తవ్యం, 2050 నాటికి కూడా అంతే శాతంతో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా తన స్థానాన్ని నిలుపుకోనుంది కానీ.. 2070 నాటికి మాత్రం ఈ మతం రెండోస్థానానికి రానుంది!

2010 లెక్కల ప్రకారం ముస్లింలు ప్రపంచంలో 23.2 శాతంతో రెండవ అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా, ఈ సంఖ్య 2050 నాటికి 6.5 శాతం వృద్ధితో ప్రపంచ జనాభాలో 29.7 శాతంతో ముందుకు దూసుకుపోనుంది. అయినా కూడా రెండోస్థానంలోనే కొనసాగే ఈ మతం.. 2070 నాటికి మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద మతం అయ్యి ప్రథమ స్థానానికి రానుంది!

ఇక హిందూ మతం విషయానికొస్తే... 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతంతో 4వ స్థానంలో ఉండగా.. 2050 నాటికి మాత్రం 14.9 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి. అయినా కూడా తన నాలుగవ స్థానాన్ని ఈ మతం నిలుకోనుంది.

హిందువుల తర్వాత స్థానంలో బౌద్దమతం 2010 లెక్కల ప్రకారమే 7.1 శాతంతో ఐదో స్థానంలో ఉండగా 2050 నాటికి 1.9శాతం తగ్గి 5.2శాతానికి పడిపోనుంది.

ఇలా అధికశాతం జనాభా ఉన్న మతాలగురించి వివరించిన ఈ అధ్యయనం.. ఏ మతానికీ చెందని నాస్తికులపై కూడా అధ్యయనం చేసి వివరాలు తెలిపింది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 16.4 శాతంగా ఉన్న ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య 2050 నాటికి 13.2 శాతానికి తగ్గనుంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి సెక్యులర్ దేశాల్లో ఈ నాస్తికుల సంఖ్య పెరుగుతుండగా.. రిలీజియన్ దేశాల్లో క్రమంగా తగ్గుతోంది.

అయితే ఈ అంశాలపై ఇలా క్లారిటీ ఇచ్చిన నిపుణులు.. మత మార్పిడి అంశంలో అప్పటి పరిణామాలను అనుసరించి అంచనాలు కాస్త అటు, ఇటయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపారు.