ప్రమాణస్వీకారం చేసేది జగన్ ఒక్కరేనా?

Sat May 25 2019 11:27:26 GMT+0530 (IST)

రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ జగన్ గెలుపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 175 స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. తొలుత అనుకున్నట్లు కాకుండా ముఖ్యమంత్రిగా జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు.  జగన్ తోపాటు కనీసం ఎడెనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా అందుకు భిన్నమైన నిర్ణయాన్ని జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రమాణస్వీకారం తానొక్కరే చేసి.. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో తొలివిడత మంత్రుల ప్రమాణస్వీకారం చేయించాలని.. మిగిలిన మంత్రుల్ని నెలాఖరులో ప్రమాణస్వీకారం చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. మంత్రుల ప్రమాణస్వీకారం మీద ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. తొలుత అంచనా వేసుకున్న దానికి భిన్నంగా భారీ ఎత్తున సీట్లు వచ్చిన నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావాహులు భారీగా పెరిగిపోయారు. దీంతో.. మంత్రి పదవులు ఆశించే వారి జాబితా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పదవుల పంపకంలో సమతౌల్యత దెబ్బ తినకుండా ఉండేందుకు కసరత్తు చేయాలన్న ఆలోచనతో తానొక్కడే ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే శుక్రవారం భారీగా ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా గెలిచిన నేతలు జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా నోరు తెరిచి మరీ కొందరు ఎమ్మెల్యే విజేతలు మీతో పని చేయాలని ఉంది సార్ అంటూ అడిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వని జగన్.. అందరి మాటలకు చిరునవ్వుతో బదులిచ్చినట్లుగా చెబుతున్నారు. పార్టీకి అండదండలున్న సామాజిక వర్గాలతో పాటు.. వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలకు తగ్గట్లే మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెబుతున్నారు.  మరి.. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కెదెవరో చూడాలి.