Begin typing your search above and press return to search.

కేశవ్ సెంటిమెంట్ మళ్ళీ నిజమయింది

By:  Tupaki Desk   |   24 May 2019 9:52 AM GMT
కేశవ్ సెంటిమెంట్ మళ్ళీ నిజమయింది
X
కాలం ఒకటి తలిస్తే.. మనం ఒకటి తలుస్తాం.. విజయం వచ్చినా ఆనందించని పరిస్థితిని కల్పిస్తే ఏమనాలి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ నేత పరిస్థితి అలానే తయారైంది. గెలిస్తే మంత్రి అయ్యే ఆయన 2014లో ఓడిపోయారు. ఇప్పుడు 2019లో గెలిచారు..కానీ ఇప్పుడు మంత్రి కాలేరు.. ఎందుకంటే టీడీపీ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి.

ఇలా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదృష్టవంతుడైన దురదృష్టవంత నేతగా పయ్యావుల కేశవ్ పేరు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి పయ్యావుల కేశవ్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వైసీసీ సునామీని తట్టుకొని గెలిచినా ఏం లాభం లేని టీడీపీ ఎమ్మెల్యేగా విగతజీవిగా పడి ఉన్నారు. ఖర్మ అని సరిపెట్టుకోవడం తప్పితే ఇప్పుడు కేశవ్ చేయడానికి లేని పరిస్థితి. మంత్రి కావాల్సిన టైంలో గెలవక.. గెలిచినప్పుడు మంత్రి కాకుండా ఉన్న కేశవ్ పరిస్థితి పగవాడికి కూడా రావద్దని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ ఒకప్పుడు టీడీపీ బ్యాచే.. ఇప్పుడున్న టీడీపీ సీనియర్లు, మంత్రులు ఆయనకు దోస్తులే. అందుకే ఏపీకి వెళ్లినప్పుడు వారితో సన్నిహితంగా మెలుగుతుంటారు. అలానే అనంతపురం జిల్లాకు వెల్లినప్పుడు కూడా పరిటాల సునీత కుమారుడు శ్రీరాం పెళ్లి లో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తో సన్నిహితంగా మాట్లాడారు. ఆయనతో రహస్యంగా ఏవేవో చర్చలు జరిపినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.

కేసీఆర్ తో రహస్య భేటి తర్వాత టీడీపీ నేతలు కూడా కేశవ్ ను అదోరకంగా చూశారట.. బాబు సీక్రెట్స్ ఏమైనా కేసీఆర్ కు చెప్పాడా అని ఫిర్యాదులు కూడా చేశారట.. బాబుకు మొదటి నుంచి తన, పరవాళ్లపై అనుమానాలు ఎక్కువని ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంటుంది. సీటు కిందకునీళ్లు వస్తున్నాయంటే సొంత మామను అయినా వదలని రకమని అంటారు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్నేహితుడంటూ టీడీపీ నేతలు, చంద్రబాబు పక్షపాతంగా చూసినా పాపం కేశవ్ అన్ని భరించి తట్టుకొని ఈ ఐదేళ్లు నిలబడ్డారని అనంతపురంలో కథలు కథలుగా చెబుతారు.

అయితే కేశవ్ కు అదృష్టం ఈసారి కలిసివచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిపించింది. కానీ టీడీపీ ఓడిపోయింది. దీంతో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందని.. ఆయన ఓడితే టీడీపీ గెలుస్తుందన్న సెంటిమెంట్ టీడీపీలో ఉదృతంగా చర్చకు దారితీస్తోంది. ఆయన గత విజయాలను, అపజయాలను కూడా ఇందుకు చూపిస్తూ కేశవ్ ఐరన్ లెగ్ అనే తరహాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇలా కేసీఆర్ స్నేహితుడు గెలిచినా ఆ సంబరం లేకుండా పోయిందని తెలుగునాట చర్చ జరుగుతోంది.