అలా అనే హక్కు చంద్రబాబుకు ఉందా?

Sun Jan 14 2018 13:55:22 GMT+0530 (IST)

చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో.. దాదాపుగా ప్రతి సమావేశంలోనూ తమ ప్రభుత్వం ఏమీ పని చేయకుండా కాలం  గడిపేస్తున్నందుకు కొన్ని కుంటిసాకులు చెబుతూ ఉంటారు. ప్రతిసారీ క్రమంతప్పకుండా ఆయన ప్రస్తావించే మాట ‘రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది’ అని. ‘‘శాస్త్రీయత లేకుండా విభజన జరిగింది గనుక.. అలా జరిగినందువలన ఏపీకి అనేక రకాలుగా నష్టాలు వాటిల్లుతున్నాయి గనుక.. ఇప్పుడు తమ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు గనుక.. తమ ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ పనినీ పూర్తిగా చేయకపోయినా ప్రజలు ఆగ్రహించకూడదు...’’ అనేది ఆయన మాటల అంతరార్థం. కానీ అలా అశాస్త్రీయ విభజన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబునాయుడుకు అసలు ఉందా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే...రాష్ట్ర విభజన బిల్లు తయారైనప్పుడు దానిని అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి కూడా పరిశీలన నిమిత్తం పంపారు కదా.. మరి.. చంద్రబాబునాయుడు.. అందులో ఉన్న అంశాలు పంపకాల గురించి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నదని అప్పట్లోనే అభ్యంతరాలు లేవనెత్తి ఉండొచ్చు కదా అనే వాదన కూడా వినిపిస్తోంది.

కానీ చంద్రబాబునాయుడు అప్పట్లో ఒక రకమైన భ్రమలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చేయవచ్చునని.. అనవసరంగా ఏపికి అన్యాయం జరుగుతోందంటూ.. ఒక రాష్ట్రం గురించి వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం దండగ అనే యోచనలో ఆయన అప్పట్లో ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు. రెండుకళ్లల్లో మీకు ఏ కన్ను ఎక్కువ ఇష్టం అంటే ఎవరికి మాత్రం ఏం సమాధానం చెబుతాం. అంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప.. వాస్తవాలు మాట్లాడలేదు. ఎన్నికల తర్వాత చూసుకుందాంలే అనుకున్నారు. ఎన్నికలు పూర్తయి తీరా తానే అధికారంలోకి వచ్చేసరికి.. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో జరిగిన అన్యాయం మొత్తం గుర్తుకు వచ్చింది. ఇదే పని బిల్లు శాసనసభ పరిశీలనకు వచ్చినప్పుడే చేసి ఉంటే గనుక.. అందులో సవరణలు సాధ్యమై ఉండేవి కదా.. అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం. చంద్రబాబు అసలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తారో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.