Begin typing your search above and press return to search.

సంచలనం: ఒక చెక్ బౌన్స్ లో భారీ స్కాం బయటకు..

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:49 AM GMT
సంచలనం: ఒక చెక్ బౌన్స్ లో భారీ స్కాం బయటకు..
X
భారీ షాకింగ్ విషయంగా దీన్ని చెప్పాలి. సంచలనంగా మారనున్న ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క చెక్కు బౌన్స్ పుణ్యమా అని రూ.3వేల కోట్లు విలువైన భారీ స్కాం ఒకటి బయటకు వచ్చింది. అత్యంత ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తుల కక్కుర్తి.. పేరాశ పుణ్యమా అని విచ్చలవిడిగా నిధులు మళ్లించిన కంపెనీని గుల్ల చేసిన దారుణం బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన ప్రైవేటు విచారణ సంస్థ సైతం షాక్ తిన్న రీతిలో నడిపిన ఈ సంచలన కథనాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల ప్రతిక బయటపెట్టింది.

సదరు కథనంలోని ముఖ్యాంశాల్ని చూస్తే. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు చేసిన దర్మార్గం తాజాగా బయలైంది. అదెలా చేశారంటే.. 2016లో సీజీ పవర్ కు చెందిన భూమి నాసిక్ లో ఉంది. ఈ భూమిని బ్లూ గార్డెన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.200 కోట్లకు అమ్మారు. ఈ భారీ మొత్తంలో రూ.145 కోట్లను అవంత హోల్డింగ్స్ కు.. మరో రూ.53 కోట్లను యూక్టాన్ అనే కంపెనీకి బదలాయించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నిధులు బదిలీ చేసిన రెండు కంపెనీలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఉండటం గమనార్హం. అంటే.. ఈ రెండు కంపెనీలు సదరు భారీ మొత్తాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాటు చేసిన డమ్మీ సంస్థలుగా అనుమానిస్తున్నారు. ఇంత భారీ మొత్తాన్ని తరలించిన ఈ రెండు కంపెనీల మూలధనం అక్షరాల రూ.లక్ష మాత్రమే కావటం మరో విశేషం.

ఇక్కడితో ఈ దోపిడీ ఆగలేదు. తర్వాతి ఏడాది.. అంటే 2017లో ముంబయిలోని కంజూర్ మార్గ్ లోని భూమిని బ్లూ గార్డెన్ ఎస్టేట్ కు రూ.190 కోట్లకు అమ్మింది. దీనికి బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేవు. విచిత్రమైన విషయం ఏమంటే అదే భూమిని సదరు కంపెనీ మరో కంపెనీకి రూ.499 కోట్లకు అమ్మటానికి అప్పటికే ఒప్పందం చేసుకుంది. కానీ.. అందుకు భిన్నంగా ఎలాంటి అనుమతులు లేకుండా బ్లూగార్డెన్ కు అమ్మేశారు.

అలా అమ్మగా వచ్చిన రూ.190 కోట్ల మొత్తాన్ని మొదటి ఉదంతంలో ఏర్పాటు చేసిన డమ్మీ కంపెనీ యాక్టాన్ కు బదిలీ చేశారు. ఇలా కంపెనీకి చెందిన ఆస్తుల్ని అమ్మేసిన అత్యుత్తమ అధికారులు.. డమ్మీ కంపెనీలకు నిధులు మళ్లించేశారు. మరీ.. దుర్మార్గం చాలా విచిత్రంగా బయటపడింది. అదెలానంటే.. యస్ బ్యాంక్ దగ్గర అవంతి హోల్డింగ్స్ సంస్థ రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. ఇంతకీ ఈ అవంతి హోల్డింగ్స్ కంపెనీ ఎవరు? దానికి సీజీ పవర్ కు లింకేమిటన్న విషయంలోకి వెళితే.. సీజీ పవర్ మాతృ సంస్థే అవంతి హోల్డింగ్స్. తన మాతృ సంస్థ తీసుకున్న అప్పును చెల్లించేందుకు సీజీ పవర్ ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కు ఒకటి బౌన్స్ అయ్యింది. అయితే.. ఈ చెక్కును సీజీ పవర్ బోర్డు అనుమతి లేకుండా చెక్కు జారీ చేసినట్లుగా గుర్తించారు. బౌన్స్ అయిన చెక్కుకు బదులుగా మరో చెక్కు ఇవ్వాలని కోరగా అందుకు బోర్డు నో చెప్పింది.

దీంతో యస్ బ్యాంకు కోర్టుకు వెళ్లింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా బోర్డు అనుమతి లేకుండా ఇలా జారీ చేసిన చెక్కులు దాదాపు ఐదు వరకూ ఉన్నట్లు తేలాయి. అంతేకాదు.. సీజీ సంస్థ అసలేం జరిగిందన్న విషయంపై విచారణకు ఆదేశించగా.. రంగంలోకి దిగిన ఒక ప్రైవేటు దర్యాప్తు సంస్థ.. విషయాలన్ని ఒక్కొక్కటిగా బయటకు తెచ్చింది. కంపెనీకి చెందిన అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొందరు అక్రమంగా కంపెనీని వాడేసిన వైనాన్ని గుర్తించటమే కాదు.. అక్రమంగా దాదాపు రూ.3వేల కోట్ల మొత్తాన్ని డమ్మీ ఖాతాలకు మళ్లించిన వైనాన్ని కనుగొన్నట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం సీజీ పవర్ ప్రమోటర్ గౌతమ్ థాపర్ ఈ విషయంపై నోరు విప్పటం లేదు. మరోవైపు.. సీజీ పవర్ ఛైర్మన్ గౌతమ్ థాపర్.. సీఎఫ్ వోలురాజీనామా చేయాలని బోర్డు కోరగా.. కంపెనీ సీఈవోను లాంగ్ లీవ్ మీదకు పంపింది. ఈ వ్యవహారం కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారినట్లు సదరు కథనం వెల్లడించింది.