Begin typing your search above and press return to search.

నెట్టింట హ‌ద్దు దాటితే..ఈ సిండ్రోమ్ త‌ప్ప‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   18 March 2017 9:49 AM GMT
నెట్టింట హ‌ద్దు దాటితే..ఈ సిండ్రోమ్ త‌ప్ప‌ద‌ట‌!
X
ఆధునిక కాలంలో ఇంట‌ర్నెట్ లేనిదే... ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డేలా లేదు. అది న‌గ‌ర‌మైనా కావ‌చ్చు... ప‌ట్ట‌ణ‌మైనా కావ‌చ్చు... చివ‌రికి ప‌ల్లెటూరు అయినా కావ‌చ్చు.,. ఇప్పుడు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేనిదే చాలా ప‌నులు నిలిచిపోతాయంతే. అంత‌మాత్రాన రోజంతా ఇంట‌ర్నెట్టే అంటూ తిరిగితే పెను ముప్పు త‌ప్పదంటున్నారు వైద్యులు. ఇదేదో సోష‌ల్ మీడియా - యాప్స్‌ పై మ‌నం గ‌డుపుతున్న స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు వైద్యులు చెబుతున్న చిట్కాలేమీ కాదు... ఏకంగా ప‌క్కాగా ప‌రిశోధ‌న‌లు చేసి మ‌రీ తేల్చిన ప‌చ్చి నిజం. ఫేస్ బుక్‌ - వాట్సాప్ - యూట్యూబ్‌ - ఇంకా మ‌రికొన్ని యాప్స్ అంటూ మ‌నం నెట్టింట గ‌డుపుతున్న కాలాన్ని లెక్క‌గ‌ట్టేసిన వైద్యులు... ప్ర‌స్తుతం మ‌నం ఎలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నామో... ప‌క్కా ఆధారాల‌తో స‌హా చెప్పేస్తున్నారు.

బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌ హ్యాన్స్‌)కు చెందిన స‌ర్వీస్ ఫ‌ర్ హెల్తీ యూజ్ ఆప్ టెక్నాలజీ పేరిట కొన‌సాగుతున్న క్లినిక్ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలు ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఆక్యుపేష‌న‌ల్ అండ్ ఎన్విరాన్‌ మెంట‌ల్ మెడిసిన్‌ ప‌త్రిక జ‌న‌వ‌రి సంచిక‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఈ నివేదిక‌ను చూస్తే... నెట్‌ లో సుదీర్ఘ కాలం గడిపేవారు ఏ మేర ప్ర‌మాదంలో ఉన్నారో ఇట్టే అర్థం కాక మాన‌దు. నెట్టింటికి బాగా అల‌వాటుప‌డ్డ మ‌నం... రాత్రి పొద్దుపోయేదాకా కూడా సోష‌ల్ మీడియాతో సంబంధాలు నెర‌పుతూనే ఉన్న విష‌యం తెలిసిందే. నిమ్‌ హ్యాన్స్ స‌ర్వే ప్ర‌కారం... సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే వారు రాత్రంతా నిద్ర‌పోకుండా మేలుకొనే ఉంటున్నార‌ట‌. తెల్ల‌వారుజామున ఏ 3 గంట‌ల‌కో నిద్ర పోతున్నార‌ట‌. ఈ విష‌యంలో పెద్ద‌లు మాత్ర‌మే ఇలా ఉంటున్నార‌నుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. ఎందుకంటే... సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పిల్ల‌లు కూడా రాత్రి 1 గంట వ‌ర‌కూ నిద్ర పోకుండా మేలుకునే ఉంటున్నార‌ట‌.

ఫ‌లితంగా నిద్ర‌పోతున్న స‌మ‌యం 8 గంట‌ల్లో అంకెలేమీ మార‌కున్నా కూడా... రాత్రి 10 గంట‌ల నుంచి మొద‌లు కావాల్సిన మ‌న నిద్ర‌ తెల్లార‌గ‌ట్లే 6 గంట‌ల‌కు ముగియాల్సి ఉండ‌గా, ఆ స‌మ‌యం కాస్తా తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు మొద‌లై మధ్యాహ్నానికి కాస్తంత ముందుగా 11 గంట‌లకు పెరిగిపోయింద‌ట‌. ఇక నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు క‌నీసం నాలుగు సార్లైనా మ‌న మొబైల్ ఫోన్‌ ను ఓపెన్ చేసి సోష‌ల్ మీడియాలోకి దూరిపోతున్నామ‌ట‌. దీనినే వైద్య ప‌రిభాష‌లో డీలేయిడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ (డీఎస్‌పీఎస్‌) అని పిలుస్తున్నారు. నిమ్‌హ్యాన్స్ స‌ర్వే ప్ర‌కారం ఈ త‌ర‌హాలో సోష‌ల్ మీడియాకు అడిక్ట్ అయిన వారు 100 నిమిషాలు ఆల‌స్యంగా నిద్ర‌కు ఉపక్ర‌మిస్తూ... 90 నిమిషాలు ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నార‌ట‌.

డీఎస్‌పీఎస్ వ‌స్తే... చిన్న వ‌య‌సులోనే గుండెపోటుకు గుర‌య్యే ప్ర‌మాదం అధిక‌మ‌వుతుంది. చిన్న వ‌య‌సులోనే గుండెపోటుకు గుర‌వుతున్న వారిలో ఈ సిండ్రోమ్ ల‌క్ష‌ణాలున్న వారే 90 శాతం ఉన్న‌ట్లు తేలింది. ఇక ఈ సిండ్రోమ్ ఫ‌లితంగా ప్ర‌తి చిన్న విష‌యానికి కూడా మ‌నం ఆదుర్దా ప‌డ‌టం కనిపిస్తుంద‌ట‌. అయినా నెట్ సౌక‌ర్యం లేకుండా చాలా ప‌నులు చేసుకోలేని ప‌రిస్థితి ఇప్ప‌టి కాలానిది. మ‌రి ఈ సిండ్రోమ్ నుంచి త‌ప్పించుకునేందుకు ఏం చేయాలి? ఈ విష‌యంపైనా స‌ద‌రు స‌ర్వే ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసింది. పొద్దంతా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసినా... క‌నీసం ప‌డుకునే ముందైనా మ‌న మొబైల్ ఫోన్‌, ఇత‌ర నెట్ వినియోగ వ‌స్తువుల‌ను ఆఫ్ చేస్తే... ఈ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చట‌. బెడ్ ఎక్కే ముందు క‌నీసం ఓ గంట ముందు మ‌న సోష‌ల్ మీడియా డివైజ్‌ల‌ను ఆఫ్ చేసేస్తే... మ‌రీ మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. సో... ఇక‌నైనా సోష‌ల్ మీడియా ప‌ట్ల కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌న్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/