Begin typing your search above and press return to search.

మేరునఘం వాజ్ పేయి.. ప్రశంసల వెల్లువ

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:37 AM GMT
మేరునఘం వాజ్ పేయి.. ప్రశంసల వెల్లువ
X

మాజీ ప్రధాని, అపర చాణక్యుడు వాజ్ పేయి మృత్యుఒడికి చేరిపోయాడు. తన రాజకీయ చతురతతో దేశానికి అణు పాఠవాన్ని నేర్పిన ఘనుడాయన.. అంతేకాకుండా శత్రుదేశం పాకిస్తాన్ తో చెలిమి చేశారు. అమెరికా, కెనెడా, రష్యా తదితర దేశాలతోనూ సత్సంబంధాలు నెరిపారు. అంతటి రాజనీతజ్ఞుడి మరణంతో భారత్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు రోజులుగా అవే వార్తలు.. అవే విశ్లేషణలు.. వాజ్ పేయి లాంటి దిగ్గజ నేత మరణాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రముఖంగా ప్రస్తావించారు. దాయాది దేశం పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా భారీగా స్పందించింది. వాజ్ పేయ్ గురించి ఎవరు ఏమన్నారంటే..

డాన్ (పాకిస్తాన్ మీడియా సంస్థ) :

అవినీతి మచ్చలేని అరుదైన నేత వాజ్ పేయి. పాకిస్తాన్ తో అద్భుతమైన శాంతి ప్రక్రియను ప్రారంభించారు. భారత దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి వాజ్ పేయి..

ద న్యూయార్క్ టైమ్స్ :

ఫ్రోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచిన నేత.. పాకిస్తాన్ లో పర్యటించి ఉద్రిక్తతలను తేలికపరిచారు.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి తాతయ్య లాంటి వ్యక్తి వాజ్ పేయి. అత్యధిక హిందువులున్న దేశంలో మైనార్టీల హక్కులకు మద్దతిచ్చారు..

బీబీసీ:

మృదుస్వభావి.. పాదరసంలా వ్యవహరించగలరు.. నెహ్రూకు బలమైన ప్రత్యర్థి. ‘నెహ్రూ తలకిందులుగా యోగా చేస్తే ఆయన దార్శనికత కూడా అలాగే ఉంది ’అని వాజ్ పేయి అన్న మాటను ప్రముఖంగా బీబీసీ ప్రచురించింది.

ది వాషింగ్టన్ పోస్ట్ :

భారత్ ను అణ్వాయుధ శక్తిగా తీర్చిదిద్దిన వాజ్ పేయ్ 93 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు..

ది గార్డియన్:

హిందూ జాతీయవాద ఉద్యమ మితవాద నేత. రాజకీయ వైరుధ్యం వాజ్ పేయి సొంతం. ఫ్రొఖ్రాన్ అణు పరీక్షలతో పాక్ తో యుద్ధ భయాన్ని కలిగించారు. పొరుగుదేశమైన దాయాదితో శాంతి కోసం ప్రయత్నించారు.