Begin typing your search above and press return to search.

వైజాగ్ థియేటర్లలో ఇవాళ ఆ ‘లైవ్ షో’

By:  Tupaki Desk   |   7 Feb 2016 4:18 AM GMT
వైజాగ్ థియేటర్లలో ఇవాళ ఆ ‘లైవ్ షో’
X
వైజాగ్ లోని సినిమా థియేటర్లకు సినిమా కోసం వెళ్లాలనుకుంటే పొరపాటు పడినట్లే. దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఎఫ్ ఆర్ ఐ)లో కీలకమైన ఆదివారం.. ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు. టీవీల్లోనే కాదు.. విశాఖలోని 30 థియేటర్లలోనూ లైవ్ ఇవ్వనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన ప్రముఖులు విశాఖకు వచ్చిన నేపథ్యంలో.. ఈ భారీ కార్యక్రమం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దీంతో.. ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చేందుకు విశాఖలోని 30 థియేటర్లను ఎంపిక చేశారు. అంతేకాదు.. ఫ్లీట్ రివ్యూను నేరుగా చూసేందుకు వీలుగా 1.4లక్షల పాసుల్ని జారీ చేశారు. అంతర్జాతీయంగా భారీ కార్యక్రమం కావటం.. విధ్వంసానికి అవకాశం ఉండటంతో ఫ్లీట్ రివ్యూకు పాసులు లేకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని నిర్ణయించారు. భద్రతలో భాగంగా విశాఖ నగరం మొత్తాన్ని జల్లెడ పట్టిన పోలీసు అధికారులు.. నగర శివారుల నుంచి వివిధ ప్రాంతాలకు దారి తీసే అన్ని ప్రాంతాలు పోలీసుల పహరాలోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఏపీ సర్కారు సమర్థంగా నిర్వహిస్తుందన్న ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.