Begin typing your search above and press return to search.

పాక్ ఎటాక్ లో ఆసక్తికర కోణాలెన్నో..

By:  Tupaki Desk   |   30 Sep 2016 7:38 AM GMT
పాక్ ఎటాక్ లో ఆసక్తికర కోణాలెన్నో..
X
సహనాన్ని చేతకానితనంగా భావించే దాయాది పాకిస్థాన్‌ కు కరెంటు షాక్ తరహాలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. భారత ప్రధాని మోడీ నోటి వెంట వచ్చిన మేనేజ్ మెంట్ గురు మాటల్ని అందరి మాదిరే ఆలోచించి పడాల్సిన గోతిలో పడటమే కాదు.. భారత్ తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న విషయం తాజాగా అర్థమైందని చెప్పాలి. ఉరీ ఉగ్ర ఘటనకు బదులు తీర్చుకుంటామని ప్రధాని మోడీ చెప్పిన మాట ఎంత అక్షర సత్యమన్నది కూడా తాజా ఎపిసోడ్ తో స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. పాక్ కు షాకిచ్చేలా జరిగిన ఎటాక్ లో ఆసక్తికర కోణాలు చాలానే ఉన్నాయి. వాటి వివరాల్లకి వెళితే..

= తాజా దాడికి ఇస్రో కీలకంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఏడాది జూన్ లో ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ‘ఆకాశ కన్ను’గా అభివర్ణిస్తారు. భారత సైనికులు టార్గెట్ గా ఫిక్స్ చేసిన ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు.. అక్కడి పరిస్థితులపై అవగాహనకు కార్టో శాట్ సాంకేతిక సాయం చేసిందన్న మాట వినిపిస్తోంది. ఫోటోలతో పాటు.. వీడియోలు కూడా చిత్రీకరించే సత్తా ఉన్న ఈ ఉపగ్రహ సేవలతోనే ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ముగింసిందన్న మాట వినిపిస్తోంది.

= భారత సైనికులు చేపట్టిన అటాక్ లో పాక్ గడ్డపై చనిపోయిన ఉగ్రవాదులు ఎంతమంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవటం.. పాక్ అసలు తమ దేశంలో లక్షిత దాడి జరగనే లేదంటూ బుకాయించటంతో.. ఈ ఎపిసోడ్ లో మరణించిన ఉగ్రవాదుల లెక్క ఒక పట్టాన తేలటం లేదు. ఒక అంచనా ప్రకారం 14 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నా.. ఆ సంఖ్య ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. మరికొన్ని మీడియా సంస్థల లెక్క ప్రకారం 40 మంది వరకూ ఉగ్రవాదులు చ‌నిపోయి ఉంటారని తెలుస్తోంది. వారికి సాయంగా నిలిచిన పాక్ సైనికులు ఎనిమిది మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అంకెలు సరిగా లేకున్నా.. ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.

= సర్జికల్ స్ట్రైక్స్ కు భారత్ ఎందుకు వెళ్లింది? దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అంటే.. అవుననే చెబుతున్నారు. భారత్ ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరిస్తుంది. తొందరపడద‌న్న ఇమేజ్ కు తగ్గట్లే తాజా దాడుల వెనుక భారీ కుట్రను చేధించేందుకే ఈ దాడులు చేసింద‌న్న‌ మాట వినిపిస్తోంది. భారత్ లోని తొమ్మిది ప్రధాన నగరాల్లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కుట్ర పన్నటం.. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం భారత్ కు చేరటంతో తాజా దాడికి మోడీ సర్కారు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని దేశంలోకి వదిలి.. భారీ విధ్వంసం సృష్టించాలన్నది ఉగ్రవాదుల లక్ష్యంగా చెబుతున్నారు. అందుకే తాజా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడి సందర్భంగా ఉగ్రవాద స్థావరాల్లో తొమ్మిది ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్ లు ఉన్నాయని చెబుతున్నారు.

= పాక్ తో యుద్ధం వస్తే? అన్న ప్రశ్నకు సమాధానం చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. మన సంగతిని పక్కన పెట్టి.. ప్రతి విషయాన్ని సాంకేతికంగా లెక్కలేసి మరీ తేల్చే అమెరికా గూఢచార సంస్థ ఏమనుకుంటుందోన‌న్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. భారత్.. పాక్ కు ఉన్న ఆయుధ సంపద.. సైనిక బలగాలు.. వాటి నేర్పు.. ఇలా లెక్కలన్నింటిని శాస్త్రీయంగా లెక్క కట్టిన అమెరికా గూఢచార సంస్థ పాక్ తో పోలిస్తే భారత్ దే పైచేయి అని తేల్చేసింది. సైనికుల సంఖ్య మొదలు ఆయుధాల వరకు భారత్ వద్దే భారీగా ఉన్నాయని.. యుద్ధం కానీ వస్తే.. దాయాదిని దెబ్బ తీసేంత ఆయుధాలు భారత్ వద్ద పుష్కలంగా ఉన్నట్లు అమెరికా తేల్చేసింది. ఒకట్రెండు అంశాలు మినహాయిస్తే.. మిగిలిన అన్ని అంశాల్లోనూ పాక్ కంటే భారతదేశమే మెరుగ్గా ఉన్నట్లుగా అమెరికా తేల్చటం గమనార్హం.