అమ్మ ఆరోగ్యం కోసమే..ఎర్రచందనం స్మగ్లింగ్ చేశా

Tue Jul 17 2018 22:33:11 GMT+0530 (IST)

కామెడీ స్కిట్ షో 'జబర్దస్త్' లో నటించిన ఓ నటుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లు కూడగట్టాడని తోటి క్యారెక్టర్ ఆర్టిస్టు నటించిన ఓ చిత్రానికి డబ్బుసాయం చేశాడని వచ్చిన వార్తలు సినీ - టీవీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్టిస్టు పేరు మొదట బయటకు రాలేదు. ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎంచుకున్న ఈ ‘జబర్దస్త్’ కమెడియన్ హరిబాబు అని తేలింది. దీంతో ఆయన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఆయనకోసం ఓ వైపు పోలీసులు గాలింపు జరుపుతుండగానే..ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో హరిబాబు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మంగళవారం ఆయన అరెస్ట్  విషయం వెల్లడించిన పోలీసులు ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కమెడియన్ హరిబాబు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని - ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతోపాటుగా దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉన్న హరిబాబు.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి.. టీవీ సీరియల్స్ జబర్ధస్త్ కామెడీ షోలో - కొన్ని సినిమాల్లో నటించాడు. ఓ రోజు తల్లి అనారోగ్యానికి గురైంది. డబ్బులు లేకపోతే ట్రీట్ మెంట్ చేయం అని ఆస్పత్రి చెప్పింది. రెండు గంటలు డాక్టర్లు పట్టించుకోలేదు.. అమ్మ ఆరోగ్యం బాగుచేయటం కోసం గత్యంతరం లేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని హరిబాబు తమకు చెప్పాడని పోలీసులు వివరించారు.  తనపై 20 కేసులు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హరిబాబు చెప్పినట్లు సమాచారం. కాగా తనపై కేసుల విషయంలో హరిబాబు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్ నాపై కక్ష కట్టి.. ఈ కేసుల్లో ఇరికించినట్లు పోలీసులకు హరిబాబు తెలిపాడు. గతంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసి.. ఇటీవల ట్రాఫిక్ కు బదిలీ అయినట్లు చెప్పాడు. ఆ కానిస్టేబుల్ పగ తీర్చుకోవటం కోసమే.. నన్ను ఇరికించినట్లు హరిబాబు ఆరోపించారు.

కాగా బతుకు తెరువు కోసం ఇండస్ట్రీకి వచ్చి ఏకంగా సినిమాలకే ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగాడని తెలుస్తోంది. ఈ మధ్యే విడుదలైన శంభో శంకర సినిమాకు ఫైనాన్స్ చేశాడని ప్రచారం జరుగుతోంది. బెంగుళూరు చెన్నై ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని కోట్లకు పడగలెత్తాడని సమాచారం. ‘జబర్దస్త్’లో దాదాపు లేడీ వేషంలోనే ఈ కమెడియన్ కనిపిస్తుంటాడని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు - పల్లెల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ఉద్యోగులు కూడా హరిబాబు వల్ల ఎర్రచందనం  అక్రమ రవాణాలో భాగమైనట్టు గుర్తించిన పోలీసులు వారిని గురించి ఆరా తీస్తున్నారు.