Begin typing your search above and press return to search.

ఉద్యోగితో అక్ర‌మ సంబంధంతో సీఈవో జాబ్ ఫ‌ట్‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:22 AM GMT
ఉద్యోగితో అక్ర‌మ సంబంధంతో సీఈవో జాబ్ ఫ‌ట్‌
X
ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందిన ఇంటెల్ కు సీఈవో అంటే మాట‌లు కాదు. ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న 58 ఏళ్ల బ్రియాన్ జానిచ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే.. ఆయ‌న త‌న ప‌ద‌విని ఇష్ట‌పూర్వ‌కంగా వ‌దులుకోలేదు. త‌న కింద ప‌ని చేసే ఉద్యోగినితో అక్ర‌మ సంబంధం క‌లిగి ఉండ‌టం.. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌టంతో.. కంపెనీ బోర్డు ఆయ‌న్ను ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోరింది. దీంతో.. ముదిమి వ‌య‌సులో అవ‌మానభారంతో త‌న ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

సంస్థ ప్ర‌మాణాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించినందు వ‌ల్లే బ్రియాన్ ను ప‌ద‌వి నుంచి త‌ప్పించిన‌ట్లుగా కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ ఎపిసోడ్‌లో సీఈవోతో సంబంధం ఉన్న మ‌హిళా ఉద్యోగి వివ‌రాల్ని మాత్రం సంస్థ బ‌య‌ట‌పెట్ట‌లేదు. బ్రియాన్ స్థానంలో మ‌రొక‌రిని తీసుకొచ్చే వ‌ర‌కూ ప్ర‌స్తుతం సీఎఫ్‌వో (చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్)గా వ్య‌వ‌హ‌రిస్తున్న జాబ్‌స్వాన్ తాత్కాలిక సీఈవోగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

1982లో బ్రియాన్ ఇంటెల్ కంపెనీలో ఇంజినీర్ గా చేరారు. ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల ప‌రిశ్ర‌మ అప్పుడ‌ప్పుడే పుంజుకుంటోంది. ఇలాంటి వేళ‌లో కంపెనీలో చేరిన ఆయ‌న త‌న స్వ‌యంకృషితో అంచ‌లంచెలుగా ఎదిగారు. కంపెనీలో ప‌లు హోదాల్లో ప‌ని చేశారు. ఇంటెల్ సంస్థ‌కు మొద‌ట్నించి ఒక పాల‌సీ ఉంది. ఉద్యోగుల‌కు ర్యాంకులు ఇవ్వ‌టం ద్వారా వారికి ప‌దోన్న‌త‌లు ఇస్తుంటారు. అలా మూడు ద‌శాబ్దాల పాటు కంపెనీకి చేసిన సేవ‌ల‌తో బ్రియాన్ సీఈవో స్థాయికి ఎదిగారు. అయితే.. సంస్థ ప్ర‌మాణాల‌కు విరుద్ధంగా ఒక మ‌హిళా ఉద్యోగినితో ఆయ‌న రాస‌లీల‌లు జ‌ర‌ప‌టం.. అవి కాస్తా బ‌య‌ట‌కు పొక్క‌టంతో ఆయ‌న్ను త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని సంస్థ బోర్డు కోరింది. దీంతో.. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.