Begin typing your search above and press return to search.

వారిపై త‌న‌లోని క‌సంతా తీర్చుకోనున్న మోడీ?

By:  Tupaki Desk   |   24 July 2017 4:26 AM GMT
వారిపై త‌న‌లోని క‌సంతా తీర్చుకోనున్న మోడీ?
X
త‌న మ‌న‌సులోని క‌సి మొత్తాన్ని తీర్చుకోవ‌టానికి ప్ర‌ధాని మోడీ ఒక సినిమాను అస‌రాగా చేసుకోనున్నారా? అంటే అవున‌ని చెబుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. వ‌రుస ఓట‌ముల‌తో విల‌విల‌లాడుతున్న కాంగ్రెస్‌కు నాయ‌క‌త్వ‌లేమి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటివేళ‌.. మోడీ లాంటి వ్య‌క్తి కాంగ్రెస్‌ కు శాపంగా మారాడ‌ని వాపోతున్నారు.

త‌న తీరుతో పార్టీని నామ‌రూపాల్లేకుండా చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌న్నింటినీ మోడీ వాడేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఉన్న‌ట్లుండి మోడీ మీద ఇంత తీవ్రంగా కాంగ్రెస్ నేత‌లు చిందులు తొక్క‌టానికి త‌గిన కార‌ణం లేక‌పోలేదు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం కాంగ్రెస్ నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. భార‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ విధించిన అత్య‌యిక ప‌రిస్థితి ప్ర‌ధానాంశంగా తీసుకొని సినిమాను రూపొందించారు.

ఈ సినిమా కానీ బ‌య‌ట‌కు వ‌స్తే.. నాటి ఇందిరమ్మ దారుణ నిర్ణ‌యం.. నేటి ప్ర‌జ‌ల మీద ప్ర‌భావం చూపించ‌ట‌మే కాదు.. స్వాతంత్ర ఫ‌లాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించిన ఆమె వైఖ‌రిని తీవ్రంగా ఖండించ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీ మీద మ‌రింత ఏహ్య భావం క‌లిగేలా చేస్తుంద‌న్న‌ది కాంగ్రెస్ నేత‌లు బాధంతా. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న ఈ చిత్రం పార్టీ నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

ద‌శాబ్దాలు గ‌డిచినా.. అత్య‌యిక ప‌రిస్థితిపై నోరు విప్పేందుకు కిందామీదా ప‌డే కాంగ్రెస్ పార్టీకి.. సినిమా లాంటి ప‌వ‌ర్ ఫుల్ మీడియం ద్వారా ఇందిర‌మ్మ తీసుకున్న నాటి నిర్ణ‌యం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ తీయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వీర‌ప్ప మొయిలీ ఇదే విష‌యాన్ని త‌న‌దైన శైలిలో ప్ర‌స్తావిస్తూ.. ఈ సినిమా విడుద‌లైతే ఎంతోమంది కాంగ్రెస్ నేత‌ల మ‌నోభావాలు దెబ్బ తింటాయ‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌ధాని మోడీకి కావాల్సింది కూడా అదేన‌ని చెప్పిన ఆయ‌న‌.. సినిమా విడుద‌ల త‌ర్వాత మోడీ చాలా బాధ ప‌డ‌తార‌ని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాను విడుద‌ల కానివ్వ‌మంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. కాంగ్రెస్ మీద త‌న‌కున్న క‌సి మొత్తాన్ని తాజా సినిమా విడుద‌ల‌తో మోడీ తీర్చుకుంటున్నార‌ని కాంగ్రెస్‌ నేత‌లు వాపోతున్నారు. ఈ వాద‌న‌లు ఇలా ఉంటే.. చిత్ర ద‌ర్శ‌కుడి మాట‌లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సినిమా మొద‌ట్లోనే.. సినిమాలో చూపించే స‌న్నివేశాల‌న్నీ నాట‌కీయ‌మే అన్న డిస్ క్లైమ‌ర్ వేస్తాం కాబ‌ట్టి ఫీల్ కావాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. ఎంత నాట‌కీయ‌మ‌ని చెప్పినా.. సినిమా చూసొచ్చిన త‌ర్వాత గూగుల‌మ్మ‌ను అత్య‌యిక ప‌రిస్థితి దారుణాల గురించి అడిగితే.. ట‌న్నుల ట‌న్నుల స‌మాచారం బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌దు. ఇది చాల‌దు.. కాంగ్రెస్ త‌ప్పుడు నిర్ణ‌యాలు ఎలా ఉంటాయ‌న్న‌ది నేటి త‌రానికి మ‌రింత బాగా తెలియ‌టానికి.