మనోళ్ల దెబ్బకు స్నాప్ చాట్ కి దిమ్మ తిరిగింది

Tue Apr 18 2017 13:07:32 GMT+0530 (IST)

నోరు పారేసుకోవటం నేతలకు మామూలే. కానీ.. ఈ మధ్య కాలంలో బలుపు కారణంగా కొందరు వ్యాపారస్తులు సైతం అప్పుడప్పడు మాటలు మిగులుతున్నారు. అలాంటి పనే చేసిన స్నాప్ చాట్ కంపెనీకి ఇప్పుడు భారత్ విలువ ఏమిటో తెలిసి వచ్చింది. పొగరబోతు మాటలతో భారతీయుల్ని అవమానించిన స్నాప్ చాట్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఇచ్చిన షాక్ తో ఒక్కసారి దిగి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మొత్తం వ్యవహారం 2015లో జరగ్గా.. వెరైటీ మీడియాసంస్థ ఈ ఇష్యూను ఈ మధ్యన తెర మీదకు తీసుకురావటంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇంతకీ అప్పట్లో ఏం జరిగిందన్నది సింఫుల్ గా చెబితే.. స్నాప్ చాట్ అంతర్గత సమావేశంలో.. భారత్ మీద దృష్టి పెట్టాలని ఒకరు సూచించగా.. దీనికి ఆ సంస్థ సీఈవో స్పైగల్ రియాక్ట్ అవుతూ.. భారత్ లాంటి పేద దేశం కోసం స్నాప్ చాట్ కాదని.. ధనికదేశాల మీద దృష్టి పెట్టాలన్న మాటను అనేశాడు.

ఆ మాట తాజాగా బయటకు రావటంతో స్నాప్ చాట్ బలుపు మీద భారతీయులు అగ్గి ఫైర్ అవుతున్నారు. భారత్ ను  అవమానించిన స్నాప్ చాట్ కు దిమ్మ తిరిగిపోయేలా భారతీయులు రియాక్ట్ అవుతున్నారు. తమ స్నాప్ చాట్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయటంతో పాటు.. సింగిల్ స్టార్ రేటింగ్ ఇవ్వటంతో.. ఆ కంపెనీకి ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతోంది.

భారతీయుల ప్రభావంతో నిన్నటి వరకూ గూగుల్ ప్లే స్టోర్ లో ఫోర్ ప్లస్ లో ఉన్న స్నాప్ చాట్ రేటింగ్.. ఒక స్టార్ కరిగిపోయి త్రీ ప్లస్ కి దిగజారిపోయింది. దీంతో.. ఆ సంస్థ షేర్ మీదా ప్రభావం చూపిస్తోంది. తాజా వివాదం నేపథ్యంలో ఒక్క సోమవారంలోనే స్నాప్ చాట్ షేర్ విలువ 1.5 శాతానికి పడిపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్న స్నాప్ చాట్ నష్టనివారణ చర్యల్ని మొదలెట్టింది.

తమ యాప్ అందరిదని..ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని.. తమ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణల్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని పేర్కొంది. భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నాప్ చాట్ వినియోగదారులకు థ్యాంక్స్ చెబుతూ.. వెన్న రాసే కార్యక్రమాన్ని మొదలెట్టింది. స్నాప్ చాట్ ఇంతలా దిగి రావటానికి కారణం లేకపోలేదు. భారత్ ను అవమానించిన విషయం తెర మీదకు వచ్చిన వెంటనే.. తమ ఆగ్రహాన్ని భారతీయులు ఆ సంస్థ యాప్ మీద ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రానికి 192906 సింగిల్ స్టార్ రేటింగ్ ఉంటే.. మంగళవారం ఉదయం నాటికి ఈ సింగిల్ స్టార్ రేటింగ్ సంఖ్య 1502203కు పెరిగిపోయాయి. ఇంత భారీగా సింగిల్ స్టార్ రేటింగ్ తో యాప్ స్టోర్ లో స్నాప్ చాట్ ఇమేజ్ భారీగా దెబ్బ తింటోంది. దీంతో.. దిగి వచ్చిన సంస్థ.. తమ యాప్ అందరికి అంటూ భారతీయులకు బిస్కెట్ వేసే పనిలో పడింది. వ్యాపారంలో బలుపు ప్రదర్శిస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/