విద్వేషదాడులు..ఆస్ట్రేలియాకు పాకాయి

Mon Mar 20 2017 13:38:26 GMT+0530 (IST)

అందరినీ విస్మయపరిచే రీతిలో అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న జాత్యంహకారం విద్వేష దాడులు కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి దురదృష్టకర దారుణాలు ఆస్ట్రేలియాకు పాకాయి. ఏకంగా ఓ మత ప్రబోధకుడిపై దుండగుడు దాడులకు పాల్పడ్డారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరమైన మెల్ బోర్న్‌లోని చర్చిలో ఈ ఘటన జరిగింది. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సదరు దుండగుడిని అరెస్టు చేశారు. జాత్యహంకరతోనే ఈ దాడి జరిగినట్లు మీడియా వెల్లడించింది.

మెల్ బోర్న్  చర్చిలో భారతీయుడైన ఫాదర్ రేవ టొమీ కళాథూర్ మాథ్యూ(48) ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో చర్చిలో ఉండగా డెబ్బై రెండేళ్ల ఆస్ట్రేలియా వాసి కత్తితో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మాథ్యును ఆస్పత్రికి తరలించగా ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు నిందితుడిని అరెస్టు చేశారు. భారతీయుడైన మాథ్యూ హిందువు లేదా ముస్లిం అని భావించి దాడి చేసినట్లు దుండగుడు పోలీసులకు వెల్లడించాడు. ఉద్దేశపూర్వక దాడి మరొకరిని గాయపర్చడం అనే ఆరోపణలపై సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయగా ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. జూన్ 13న ఆయన్ను స్థానిక కోర్టులో హాజరుపర్చి  కేసు దర్యాప్తు చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/