ట్రంప్ ను కలిసేందుకు ఎన్ ఆర్ ఐ అలా చేశాడు

Wed Jun 13 2018 11:11:44 GMT+0530 (IST)

మీరు గమనించారో లేదో.. ప్రపంచంలో మంచి.. చెడు అన్న తేడా లేకుండా అభిమానించే వారెందరో. ట్రంప్ అంటే చాలు మండిపడే వాళ్లు ఉన్నట్లే.. ఆయన్ను విపరీతంగా అభిమానించి.. ఆరాధించేవారూ ఉంటారు.అలానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను కూడా. తాను అభిమానించే ట్రంప్ ను కలవటం కోసం భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో భేటీ కోసం సింగపూర్ వచ్చిన ట్రంప్ ను కలిసేందుకు.. ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు మలేసియాకు చెందిన భారత సంతతి యువకుడు ఒకడు చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. పాతికేళ్ల వయసున్న మోహన్ అనే కుర్రాడు తన తండ్రికి చెందిన కన్సెల్టెన్సీ వ్యాపారంలో పని చేస్తుంటాడు. ట్రంప్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన్ను కలుసుకోవాలన్నది కల. దీని కోసం ఆయన పెద్ద సాహసమే చేశారు.

సింగపూర్ వచ్చిన ట్రంప్ ను.. ఆయన బస చేసిన హోటల్లోనే బస చేశాడు. ట్రంప్ రూమ్ కి కాస్త దూరంలోనే రూమ్ సంపాదించాడు.ఇందుకోసం రూ.38వేలు ఖర్చు చేశాడు.

హోటల్లో రూం సంపాదించగలిగాడు కానీ..ఆయన్ను కలుసుకోవటం మాత్రం సాధ్యం కాలేదు. అమెరికా అధ్యక్షుడ్ని కలవటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. కట్టుదిట్టమైన భద్రత.. మందీ మార్బలంతో ఉండే ట్రంప్ కోసం చాలానే ప్రయత్నించాడు మోహన్.
 
లాబీలో తన అభిమాన నేత కోసం మంగళవారం సాయంత్రం నుంచి ఐదు గంటల పాటు వెయిట్ చేశాడు. తనకెంతో ఇష్టమైన ట్రంప్:  ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ పుస్తకంపై ట్రంప్ సంతకం తీసుకోవాలనుకున్నాడు. కానీ.. సాధ్యం కాలేదు. అయినప్పటికీ తన ప్రయత్నం వదలకుండా పక్కరోజు ఉదయమే  లాబీల్లోకి వాలిపోయాడు.

సరిగ్గా 8 గంటల సమయంలో ట్రంప్ తన గది నుంచి బయటకు వచ్చారు. వెళుతూ.. వెళుతూ.. మోహన్ కళ్లల్లోకి ఒక చూపు చూసి వెళ్లిపోయారు. ట్రంప్ దగ్గరకు వెళ్లటమే కష్టమన్నారు. ఆయన నన్ను చూశారు.. కలవటానికి ఒక్క శాతం ఛాన్స్ ఉండదన్నారు.. కానీ.. ఆయన్ను నా వైపు చూశారంటూ సంబరపడిపోతున్నాడు మోహన్. ట్రంప్ ఆటోగ్రాఫ్ తీసుకోలేకపోయినా.. ఆయన కంట్లో తాను పడ్డానని సంతోషపడిపోతున్నాడు. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదేదీ ఉండదన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి రుజువుచేస్తుందని చెప్పాలి.