Begin typing your search above and press return to search.

అమెరికాలో మ‌నోడిపై జాతివిద్వేష వ్యాఖ్య‌లు..!

By:  Tupaki Desk   |   15 Aug 2018 7:01 PM GMT
అమెరికాలో మ‌నోడిపై జాతివిద్వేష వ్యాఖ్య‌లు..!
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో జాతి విద్వేష వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. కొద్దికాలం క్రితం వ‌ర‌కు తీవ్ర స్థాయిలో వెలుగులోకి వ‌చ్చిన ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల స‌ద్దుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా అలాంటిదే మ‌రో ఘ‌ట‌న ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. భారతీయ మూలాలు ఉన్న తాజ్ సర్దార్ అమెరికాలోని యాష్ ల్యాండ్‌లో `ద కింగ్స్ డైనర్` పేరుతో రెస్టారెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న రెస్టారెంట్‌ కు ఓ అమెరికన్ కస్టమర్ వ‌చ్చారు. అతని కుటుంబానికి భారతీయ సంప్రదాయ పద్ధతిలో తాజ్ స‌ర్దార్‌ స్వాగతం పలికారు. అయితే, ఇదే ఆ అమెరిక‌న్ దృష్టిలో తప్పయిపోయిన‌ట్లుంది.

రెస్టారెంట్‌ లో భోజనం చేసి వెళ్లిపోతున్న ఆ ఆమెరిక‌న్ రెస్టారెంట్ ఫోటో తీసుకున్నారు. అనంత‌రం ఆ కస్టమర్ ఫేస్‌ బుక్‌ లో హోట‌ల్‌ ను ట్యాగ్ చేస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘బహుశా నేను అల్ ఖైదాకు డబ్బులిస్తున్నాను’ అని కామెంట్ రాసి పోస్ట్ చేశాడు. ఈ విష‌యం ఆల‌స్యంగా తాజ్ స‌ర్దార్ దృష్టికి చేరింది. దీంతో ఆయ‌న తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. ఆ అమెరిక‌న్ చేసిన వ్యాఖ్య స‌ర‌దాకు చేశారో సీరియస్‌ గానే కామెంటో చేశారో అర్థం కాలేదని వాపోయాడు. 2006లో భారత్ వదిలి చట్టబద్ధంగా కుటుంబంతో సహా అమెరికా వచ్చి 2010 నుంచి యాష్ ల్యాండ్ లో రెస్టారెంట్ నడుపుతున్నానని.. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే తనను తన్ని తరిమేస్తారని భయం వేస్తోందని చెప్పాడు. ఆ కామెంట్ చదివి తనకెంతో దు:ఖం వేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే, యాష్ ల్యాండ్‌ లో రెస్టారెంట్ య‌జ‌మాని తాజ్‌ సర్దార్ పై జాతివిద్వేష వ్యాఖ్యల వ్యవహారం వెలుగు చూసిన నేప‌థ్యంలో అతని మిత్రులు అతనికి మద్దతుగా నిలిచారు. ఈ దుష్ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పెట్టారు. దీంతో యాష్ ల్యాండ్ మేయర్ స్టీవ్ గిల్మోర్ రంగంలోకి దిగారు. త‌న ప‌రిధిలోని ముగ్గురు సిటీ కమిషనర్లను వెంట తీసుకొని ద కింగ్స్ డైనర్ రెస్టారెంట్ కి వెళ్లారు. తాజ్ సర్దార్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు. జాతివివక్ష చూపేవారికి నగరంలో స్థానం లేదని గిల్మోర్ ప్రకటించారు. మ‌రోవైపు స‌ద‌రు వ్య‌క్తి ప‌నిచేస్తున్న సంస్థ కూడా స్పందించారు. ఫేస్‌ బుక్‌ లో తాజ్ సర్దార్ పై జాతివిద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పోర్ట్స్ మౌత్ ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ లో పనిచేస్తాడని గుర్తించి ఆ సంస్థ‌ అతనిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. తమ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన వివాదస్పద జాతివివక్షల వ్యాఖ్యల గురించి తెలిసిందని.. తాము, తమ 650 మంది ఉద్యోగుల బృందం తాజ్ సర్దార్ ను క్షమాపణ కోరుతున్నట్టు తెలిపింది. కాగా, జాతివిద్వేష వ్యాఖ్యల నేప‌థ్యంలో స‌ద‌రు వ్య‌క్తి ప‌నిచేసిన సంస్థ యాజ‌మాన్యం - న‌గ‌ర మేయ‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరుప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి చ‌ర్య‌లు వ‌ల‌స‌దారుల‌కు గుండె నిబ్బ‌రాన్ని ఇస్తాయ‌ని పేర్కొంటున్నారు.