Begin typing your search above and press return to search.

చిరుతకే చుక్కలు చూపించాడు

By:  Tupaki Desk   |   8 Feb 2016 6:25 AM GMT
చిరుతకే చుక్కలు చూపించాడు
X
అడవిలో ఉండవలసిన చిరుత పట్టణంలోని ఒక పాఠశాలలో షికార్లు చేసింది. సరదాగా స్కూలుకు వెళ్లాలనిపించిందేమో... అమాంతం బడిలోకి వచ్చేసింది. బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ ప్రాంతంలో ఉన్న విబ్ గ్యార్ పాఠశాలలో ఆదివారం వేకువన 4 గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి తరగతి గదుల మధ్య తిరిగిన దృశ్యాలు అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆదివారం ఉదయం సీసీ ఫుటేజి చూసిన పాఠశాల సిబ్బంది నిర్ఘాంతపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.

చివరకు పాఠశాల ప్రాంగణంలోనే చిరుతను గుర్తించారు. అయితే.... దాన్ని పట్టుకోవడం వారికి పెద్ద పనే అయింది. ఈ ప్రయత్నంలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిలో సంజయ్ గుబ్బి అనే వ్యక్తి కాలు, చెయ్యిని చిరుత తీవ్రంగా కొరికింది. దీంతో సంజయ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఆయనకు తన ఎదురుగా చిరుత ఉందన్న భయం పోయింది. ఆ కోపంలో ఆయన చిరుత అని.... అడవి జంతువు అని... అది తననేమైనా చేస్తుందన్న భయం కోల్పోయాడు. ఇంకేముంది చిరుతను కుక్కను కొట్టినట్లు కొట్టాడు. ఊహించని దెబ్బలకు చిరుత బెంబేలెత్తిపోయింది. సంజయ్ బారినుంచి తప్పించుకుని పారిపోయింది. మళ్లీ అటవీశాఖాధికారులు దాన్ని వెతికి చివరకు సాయంత్రానికి పట్టుకోగలిగారు. ఇదే ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం కూడా చిరుత తిరిగిందని స్థానికులు చెబుతున్నారు.