Begin typing your search above and press return to search.

ఐసిస్ క్రూరత్వం గురించి తెలుగు డాక్ట‌ర్‌ మాటలివి

By:  Tupaki Desk   |   27 Feb 2017 6:15 AM GMT
ఐసిస్ క్రూరత్వం గురించి తెలుగు డాక్ట‌ర్‌ మాటలివి
X
అంత‌ర్జాతీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చెరలో దాదాపు రెండు సంవత్సరాల పాటు బందీగా ఉండి ఇటీవ‌లే విముక్తమైన తెలుగు డాక్టర్ రామ్మూర్తి తాను అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టారు. భారత అధికారుల చొరవతో ఐసిస్ చెర నుంచి బయటపడిన రామ్మూర్తి 18నెలల తర్వాత ఆదివారం ఏలూరులోని తన ఇంటికి చేరుకున్నారు. తీవ్ర ఉత్కంఠ - ఉద్వేగం మధ్య ఇన్ని నెలలు గడిపిన కుటుంబ సభ్యులు ఆయన రాకతో పరమానందభరితులయ్యారు. ఇన్నేళ్ల‌ తరువాత ఇవాళే పండగ అంటూ సంబ‌ర‌ప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన రామ్మూర్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు 2015 సెప్టెంబర్ 15న లిబియాలో కిడ్నాప్ చేశారు. భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అంతిమంగా విడుదలైన ఆయన మీడియా ముందు ఐసిస్ ఉగ్రవాద లక్ష్యాలనూ వివరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన అంశాలు భీతిగొల్పే విధంగా ఉన్నాయి.

2015 సంవత్సరంలో తన కాంట్రాక్టు పూర్తికావడంతో గ్రాట్యుటీ కోసం లిబియా వైద్యశాఖకు దరఖాస్తు చేసుకున్నానని, అప్పట్లో వారు కొద్దిరోజులు వేచివుంటే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారన్నారు. ఆ విధంగానే తాను అక్కడున్న ఒక గదిలో వేచివున్నానని, అయితే ఒక రోజు అర్ధరాత్రి ఐసిస్ ఉగ్రవాదులు అక్కడకు చేరుకుని తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. వారి జైల్లోనే ఉన్న తాను శ్యాం అనే మరో భారతీయుడ్ని కలుసుకున్నానని చెప్పారు. తాను జైలులో వున్న సమయంలో మరో ఇద్దరు భారతీయులు కూడా పరిచయం చేసుకున్నానని, శ్రీకాకుళం, కరీంనగర్‌కు చెందిన వారు హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. కాగా తాను డాక్టర్ కావడంతో ఐసిస్ ఆసుపత్రిలో వైద్యుల అవసరం అధికంగా ఉందని, అక్కడ పనిచేయాలని వారు పలుమార్లు కోరారన్నారు. అయితే తనకు వయస్సు అధికం కావడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వారికి వివరించానన్నారు. అయినప్పటికీ ఆ తరువాత కూడా తనను పలుమార్లు అడగడంతో చివరకు వైద్యం చేయడానికి అంగీకరించానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మారి, లిబియా మిలిటరీ దాడులు అధికం అవుతూ వచ్చాయని చెప్పారు. ఆ సమయంలోనే తనకు బుల్లెట్ గాయం కూడా అయ్యిందన్నారు.

ఐసిస్ ఉగ్రవాదులు విద్యావంతులైన యువకులని, భారత్ గురించి వారికి బాగా తెలుసునని రామ్మూర్తి అన్నారు. భారత్‌తో సహా వివిధ దేశాల్లోకి తమ సిద్ధాంతాల్ని విస్తరించాలన్నదే వారి ధ్యేయంగా కనిపించిందన్నారు. తమ ఆసుపత్రుల్లో సర్జరీలు చేయించుకునేందుకు తనను ఉపయోగించుకున్నారని చెప్పారు. ఐసిస్ ఆకృత్యాలను వివరించిన ఆయన మిలిటెంట్లు తనను దూషించేవారని, శారీరకంగా చేయిచేసుకోలేదని చెప్పారు. ఉగ్రవాదుల చిత్ర హింసల్లో తన కాళ్లకు, చేతులకు అయిన గాయాలనూ చూపించారు. అయితే వారి చెరలో ఉండటం తనకు నరకంగానే అనిపించిందన్నారు. ఇరాక్, సిరియా, నైజీరియా తదితర ప్రాంతాల్లో తాము జరిపిన దారుణాలకు సంబంధించిన వీడియోలను తమకు చూపించేవారన్నారు. వాటిని చూసేందుకే తాము భయపడిపోయేవారమని రామ్మూర్తి వివరించారు. తనను మొదట తమ ఆసుపత్రుల్లో పనిచేయమని కోరారని అయితే తనకు వైద్యం తెలిసినా సర్జరీలు రావని చెప్పానన్నారు. దాంతో వారు తనను మహాకామా జైలు నుంచి తప్పించి మరో జైలుకు తరలించారని..అక్కడ అన్ని రకాల ఆకృత్యాలను తాను చూశానని వెల్లడించారు. ఏదేమైనా ఎట్టకేలకు ఆ చెర నుంచి లిబియా మిలటరీ తనను బయటకు తీసుకువచ్చిందని, ఆ తరువాత తనకు ఫోన్ అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశానని, అక్కడి భారత దౌత్యకార్యాలయానికి కూడా సమాచారం అందించానన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజుల్లో వారు స్పందించి తనను అక్కడి నుంచి విడిపించి భారత్‌కు పంపారన్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/