Begin typing your search above and press return to search.

చైనాలో మ‌న డ‌బ్బు ప్రింటింగ్‌....అబ్బే

By:  Tupaki Desk   |   14 Aug 2018 2:16 PM GMT
చైనాలో మ‌న డ‌బ్బు ప్రింటింగ్‌....అబ్బే
X
మేడిన్ చైనా పేరుతో చిన్న పిల్లాడు వాడే బొమ్మ నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా డ్రాగ‌న్ కంట్రీ వ‌స్తువుల‌కు అలవాటు అయిన‌ట్లే...అదే దేశానికి మ‌రో కోణంలో మ‌నం బానిస‌లం అయ్యామ‌నే వార్త క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మేడిన్ చైనా వస్తువులు మ‌న‌జీవితంలో భాగం అయిపోయిన‌ట్లే.. మ‌న డబ్బు కూడా చైనాలో ముద్రితం అయిపోయిందని సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌డింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప‌త్రిక ఈ మేర‌కు ఓ సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇండియాతోపాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చైనాకు భారీగా ఆర్డర్లు వచ్చాయ‌ని - 2013కు ముందు వరకు చైనా అసలు విదేశీ నోట్ల ముద్రణ జోలికి వెళ్లలేదని చైనా బ్యాంక్ నోట్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ లియు గుషెంగ్ వెల్లడించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక రాసిన కథనం తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మన కరెన్సీని మన శత్రు దేశమైన పాకిస్థాన్‌ కు సన్నిహితంగా ఉండే చైనాలో ముద్రించడం ఏంటన్న ప్రశ్నను చాలా మంది లేవనెత్తారు.

ఇండియాతో పాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్లను ముద్రించే భారీ ఆర్డర్ చైనాకు దక్కిందని వార్త‌ - దానిపై వివిధ వ‌ర్గాల ఆగ్ర‌హం నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది. ఇండియన్ కరెన్సీని చైనాలో ముద్రిస్తున్నారన్న వార్తలు పూర్తి నిరాధారమైనవని స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు. ``చైనాకు చెందిన కరెన్సీ ప్రింటింగ్ కార్పొరేషన్‌ కు ఇండియన్ కరెన్సీ ముద్రణ కోసం భారీ ఆర్డర్ వచ్చిందన్న వార్తలు పూర్తి నిరాధారం. ఇండియన్ కరెన్సీని ఇక్కడి ప్రభుత్వ - ఆర్బీఐ కరెన్సీ ప్రెస్‌ లలోనే ముద్రిస్తాం`` అని వెల్లడించారు. చైనా బ్యాంక్‌ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు లియు గుషెంగే వెల‌ల్ల‌డించార‌ని పేర్కొంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో చెప్పడం స‌త్య‌దూర‌మ‌ని ఆయ‌న తెలిపారు.

కాగా, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. 2013లో ఎప్పుడైతే ఆగ్నేయ ఆసియా - మధ్య ఆసియా - గల్ఫ్ - ఆఫ్రికా - యూరప్‌ లతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందో అప్పటి నుంచి విదేశీ కరెన్సీ ముద్రణ ఊపందుకుంది. ఇండియాతోపాటు థాయ్‌ లాండ్ - బంగ్లాదేశ్ - శ్రీలంక - మలేషియా - బ్రెజిల్ - పోలాండ్‌ లాంటి దేశాల కరెన్సీలను ముద్రించే చాన్స్ కొట్టేసింది. అయితే మన శత్రు దేశమైన పాకిస్థాన్‌ తో ఎంతో సన్నిహితంగా ఉండే చైనాలో మన కరెన్సీ ముద్రణ జరగడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల పాకిస్థాన్‌ కు నకిలీ కరెన్సీ ముద్రించడం మరింత తేలిక అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో వివాదం ముద‌ర‌కుండా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.