అమెరికా అతి జాగ్రత్త మనోడి ప్రాణాలు తీసిందా?

Fri May 19 2017 12:56:53 GMT+0530 (IST)

జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు. కానీ.. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే అమెరికా వైఖరిపై పలువురు తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఇలాంటి విమర్శల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. మాత్రం అమెరికా అధికారులు విచారణ పేరుతో వ్యవహరించే వైఖరి మీద ఆగ్రహం కలగటమే కాదు.. అన్యాయంగా మనోడి ప్రాణాలు పోయేలా చేశారన్న బాధ కలగటం ఖాయం.

అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు భారత్ కు చెందిన 58 ఏళ్ల అతుల్ కుమార్ బాబు భాయ్ పటేల్ అనే వ్యక్తిని ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర సరైన పత్రాలు లేవన్న ఆరోపణతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఈక్వెడార్ నుంచి మే 10న అమెరికా ఎయిర్ పోర్ట్ లో దిగారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులకు ఆయన్ను అప్పగించారు.

అనంతరం ఆయన్ను రెండు రోజుల పాటు అట్లాంటా సిటీలోని డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు. పటేల్ కు డయాబెటిస్.. బీపీ ఉండటంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని కోరటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచినట్లుగా అమెరికా అధికారులు చెబుతున్నారు.

తమ అదుపులో ఉన్న వారు మరణించటం చాలా అరుదుగా జరుగుతుంటుందని అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. పటేల్ మృతి గురించి అమెరికాలోని భారత ప్రతినిధులకు.. ఆయన కుటుంబానికి సమాచారం అందించారు. 58 ఏళ్ల వ్యక్తి మీద నిజంగానే సందేహాలు ఉంటే.. అమెరికా లాంటి అగ్రరాజ్యానికి వివరాలు సేకరించటం ఎంతసేపు? అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తి మీద అనుమానం వస్తే.. ఆ వివరాల్ని సేకరించి.. అతడు దోషి అని తేలే వరకూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా అధికారుల మీద లేదా? అన్న సందేహం రాక మానదు. దాదాపు ఎనిమిది రోజులకు పైగా విచారణ పేరుతో సాగిన వైనం చూసినప్పుడు.. ఒక అమాయకుడి ప్రాణాలు అనవసరంగా పోయేలా అమెరికా అధికారుల వైఖరి ఉందా? అన్న సందేహం కలగకమానదు. ఈ ఉదంతం చూస్తే.. అమెరికా అధికారుల తీరుపై ఆగ్రహం కలగటం ఖాయమని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/