Begin typing your search above and press return to search.

ఏ క్షణమైనా ఉగ్రదాడులు... కవ్విస్తున్న పాక్!

By:  Tupaki Desk   |   1 Oct 2016 7:12 AM GMT
ఏ క్షణమైనా ఉగ్రదాడులు... కవ్విస్తున్న పాక్!
X
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన అనంతర పరిణామాలు - ఉగ్రవాదుల వాదనను భుజానికెత్తుకున్న పాక్ నేతలు చేస్తున్న మాటలు - తాజాగా మసూద్ వంటి ఉగ్రవాదుల వ్యాఖ్యలు అనంతరం... పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌ పై దాడి చేయవచ్చని, అది ఏ ప్రాంతంలో అయినా కావొచ్చని కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాలు హెచ్చరిక జరీచేశాయి. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించడంతో పాటూ ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. ఇదే సమయంలో సరిహద్దు వెంట ఉన్న భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతాధికారులను కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఆదేశించారు.

దీంతో బీఎస్‌ ఎఫ్ పోస్టులపై పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరిగినా వాటిని సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టేందుకు తీసుకున్న చర్యలు - సరిహద్దుల్లో ప్రజల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఉన్నత స్థాయి భద్రతాధికారులు వివరించారు. అలాగే బీఎస్‌ ఎఫ్.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో అన్ని యూనిట్లను అత్యంత అప్రమత్తంగా ఉంచింది. అలాగే ముఖ్యంగా జమ్మూ - పంజాబ్ - రాజస్తాన్ - గుజరాత్‌ ల్లో నిఘాను పెంచాలని ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించి 72 గంటలు అయిందో లేదో ఇంతలోనే తన కుక్కతోక వంకర బుద్దిని పాక్ మరోసారి బయటపెట్టుకుంది. కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్న పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా శనివారం ఉదయం మరోసారి మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ అఖ్నూర్‌ సెక్టార్‌ వద్ద గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్స్‌ తో దాడులకు పాల్పడ్డాయి. దీంతో ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు ఉదయం 4.00 గంటల నుంచి బుల్లెట్ల వర్షాలతో ఆ ప్రాంతమంతా మోత మోగిపోతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచీ పాక్ చర్యలకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానమిస్తున్నాయి.

కాగా సరిహద్దుల్లో ఇప్పటికే సుమారు 1000 గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనమనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి జరుగుతున్న ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/