Begin typing your search above and press return to search.

దావోస్‌ లో హ‌వా అంతా...మ‌నోళ్ల‌దే

By:  Tupaki Desk   |   21 Jan 2018 4:44 PM GMT
దావోస్‌ లో హ‌వా అంతా...మ‌నోళ్ల‌దే
X
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)..ఈ ప్ర‌తిష్టాత్మ‌క స‌ద‌స్సు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత్యంత ప్రాధాన్య‌త‌ను క‌లిగి ఉన్న ఈ స‌దస్సు...స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో రేపటి నుంచి మొదలవబోతోంది. ఈ స‌ద‌స్సు ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంది. ఇటు భార‌త‌దేశానికి..అటు తెలుగు రాష్ట్రాల‌కు ఈ స‌ద‌స్సు ఎంతో కీల‌క‌మైన‌దిగా నిలవనుంద‌ని అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - ఐటీ మంత్రి కేటీఆర్‌ - యోగా గురు బాబా రాందేవ్ - సినీ న‌టుడు షారుక్ ఖాన్ హ‌ల్ చ‌ల్ చేయ‌నున్నారు.

దేశ - విదేశాల్లోని రాజకీయ - పౌర - విద్య - కళారంగాలకు చెందిన 3000 మంది పాల్గొనే ఈ సదస్సులో తొలిసారి యోగాకు చాన్స్ దక్కింది. ఈ సదస్సు సందర్భంగా ప్రతి రోజు ఉదయం - సాయంత్రం రెండు సెషన్లపాటు ప్రతినిధులంతా యోగా చేయనున్నారు. ఈ విషయాన్ని యోగా గురు రాందేవ్ బాబా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఈ సదస్సులో అత్యధికంగా ఇండియా తరఫున 130 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇక 20 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని డబ్ల్యూఈఎఫ్‌ లో పాల్గొనబోతున్నారు. 1997లో దేవెగౌడ తర్వాత డబ్ల్యూఈఎఫ్‌ కు హాజరవుతున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీయే. ఇప్పటికే దావోస్ చేరుకున్న ప్రధాని మోడీ.. మంగళవారం సదస్సులో ప్రసంగించనున్నారు.

డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాజ్ ష్వాబ్ సదస్సు ప్రారంభమైనట్లుగా సోమవారం ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ ను సన్మానించనున్నారు. ప్రతి ఏడాది ఇచ్చే క్రిస్టల్ అవార్డుల్లో భాగంగా షారుక్‌ కు ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఇక సాయంత్రం ఇండియా ప్రత్యేకంగా వెల్‌ కమ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యోగాను ప్రతినిధులకు పరిచయం చేయడంతోపాటు నోరూరించే భారత వంటకాలను వడ్డించనున్నారు. మంగళవారం నుంచి అధికారిక సెషన్స్ మొదలవుతాయి. ఈ సందర్భంగా ఓపెనింగ్ ప్లీనరీలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. సోమవారం సాయంత్రం సదస్సులో పాల్గొనబోయే 60 కంపెనీల సీఈవోలకు మోడీ డిన్నర్ ఇవ్వనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు తొలిసారి తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. జపాన్ పర్యటన పూర్తి చేసుకొని అక్కడి నుంచే ఆయన దావోస్ వెళ్లిపోయారు. ఇప్ప‌టికే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌య‌లుదేరి వెళ్లారు.