Begin typing your search above and press return to search.

గంటాకు గ‌ట్టి దెబ్బే త‌గిలిందండోయ్‌!

By:  Tupaki Desk   |   23 Feb 2017 9:48 AM GMT
గంటాకు గ‌ట్టి దెబ్బే త‌గిలిందండోయ్‌!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు ఇటీవ‌ల షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ తీసుకున్న రుణానికి బ్యాంకుల వ‌ద్ద ష్యూరిటీగా ఉన్న కార‌ణంగా గంటా ఆస్తుల‌న్నీ పోగొట్టుకునే ప‌రిస్థితిని కొని తెచ్చుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు బిజినెస్ మ్యాన్‌ గా రాణించిన గంటా... ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో ఎత్తు ప‌ల్లాల‌ను చూశారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన గంటా... ఆ త‌ర్వాత కాంగ్రెస్ ద్వారా చివ‌రికి త‌న సొంత గూటికే చేరారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటాకు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. త‌న కేబినెట్‌ లో గంటాను మంత్రిగా చేర్చుకున్న చంద్ర‌బాబు... కీల‌క‌మైన విద్యాశాఖ పేరును మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌గా మార్చేసి ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టారు.

అయితే అంత‌కుముందు త‌న‌కు తెలిసిన వార‌న్న భావ‌న‌తో గంటా కోట్లాది రూపాయ‌ల రుణానికి గ్యారెంట‌ర్‌ గా ఉండేందుకు సంత‌కాలు పెట్టేశారు. అదే ఇప్పుడు ఆయ‌న‌న‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇక ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన వివ‌రాల్లోకెళితే... మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖపట్నం డాబాగార్డెన్‌ లోని ఇండియన్‌ బ్యాంకు నుంచి 2005లో దాదాపు రూ.141.68 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించని కారణంగా వడ్డీతో కలిపి రూ.196 కోట్ల మేర బకాయి పేరుకు పోయింది. దీన్ని చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీచేసినా కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ - ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు చెందిన ఆస్తులతోపాటు ఈ రుణం కోసం మంత్రి శ్రీనివాసరావు - కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు - పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు - పరుచూరి వెంకట భాస్కరరావు - కొండయ్య బాలసుబ్రహ్మణ్యం - నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబర్‌ 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్‌ బ్యాంకు అధికారులు ప్రకటించారు. స్వాధీనం నోటీసు అనంతరం 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.

అయితే కంపెనీతోపాటు హామీదారులెవరూ స్పందించకపోవడంతో ఆస్తులను తమ అధీనంలో తీసుకుంటున్నట్టు బుధవారం పొజిషన్‌ నోటీసు జారీ చేశారు. కాగా, పెరిగిన వడ్డీతో సహా రుణ బకాయిలు ప్రస్తుతం రూ.203.62 కోట్లకు చేరినట్లు బ్యాంకు తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతోకొంత రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఆయా కంపెనీలు - హామీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులతోపాటు అదనంగా మరో రెండు కీలకమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటన జారీ చేసింది. వీటితో పాటు తాజాగా గంటాకు చెందిన మ‌రో రెండు ఆస్తుల‌ను ఇండియ‌న్ బ్యాంకు స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్‌ టౌన్‌ పరిధిలోని షోలింగనల్లూర్‌ గ్రామంలో సర్వే నెం.12/1 - 13/1 పార్ట్ - 13/2 పార్ట్‌ లలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ నెం.281ఏను ఫిబ్రవరి 16న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మణికొండ జాగీర్‌ గ్రామంలో సర్వే నెం.201లో ల్యాంకో హిల్స్‌ టవర్‌–5లో 67.92 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మొదటి, రెండో అంతస్తులను ఫిబ్రవరి 17న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/