Begin typing your search above and press return to search.

భారతీయుల ప్రేమకు అమెరికన్లు ఫిదా!

By:  Tupaki Desk   |   27 March 2017 6:03 AM GMT
భారతీయుల ప్రేమకు అమెరికన్లు ఫిదా!
X
అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్‌ కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్లపై గత నెలలో ఓ దుండగుడు కాల్పులు జరుపడం, ఆ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ సమయంలో ఇయాన్ గ్రిలాట్ తన ప్రాణాలకు తెగించి దుండగుని నిలువరించారు. జాతి విద్వేష దాడి నుంచి ఇండో-అమెరికన్‌ ను కాపాడిన అమెరికన్ ఇయాన్ గ్రిలాట్‌ పై హూస్టన్‌ లోని ఇండియా హౌస్ ప్రశంసల వర్షం కురించింది. ఇయాన్ గ్రిలాట్ నిజమైన అమెరికా హీరో అని కొనియాడింది. అంత‌టితో ఆపేయ‌కుండా గ్రిలాట్ సాహసాన్ని గుర్తించిన ఇండియా హౌస్ ప్రతినిధులు ఆయనకు గృహం కొనుగోలు కోసం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు.

ఇండియా హౌస్ 14వ వార్షికోత్సవం సందర్భంగా గ్రిలాట్‌ ను ఘనంగా సత్కరించి లక్ష డాలర్లు(రూ.66లక్షలు) అందజేశారు. ఈ సొమ్మును హూస్టన్‌లోని భారత సంతతి విరాళాల ద్వారా సేకరించారు. ఈ సందర్భంగా గ్రిలాట్ మాట్లాడుతూ, ఆ రోజు దుండగుడిని నిలువరించకపోతే తన ప్రాణాలు కూడా పోయేవని చెప్పారు. తాను చేసిన పని వల్ల ప్రేమ, ఆశలతో కూడిన ఓ గొప్ప సందేశం సమాజంలోకి వెళ్లిందని తెలిపారు. ఇండియా హౌస్ ప్రతినిధులు తనను సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవ సభకు అధ్యక్ష వహించిన ప్రముఖ ఇండో అమెరికన్ జితిన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇతరుల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గ్రిలాట్ దుండగుడిని అడ్డుకున్నాడని, అతడు నిజమైన అమెరికా హీరో అని కొనియాడారు.

హూస్టన్‌లోని భారత సంతతి ఇండియా హౌస్ అనే కమ్యూనిటీ సెంటర్ నిర్మించి ఆ ప్రాంతంలోని వివిధ వర్గాల వారికి సేవలు అందిస్తున్నారు. హ్యూస్టన్‌ లోని భారతీయ సంతతి వారి తరఫున ఇండియన్ హౌస్ అతని నిస్వార్థ చర్యను గుర్తించిందని, ఇల్లు కొనడం కోసం గ్రిల్లోట్‌ కు సాయం చేయాలని నిర్ణయించినట్లు సంస్థ ఫేస్‌ బుక్ పేజిలో ఉంచిన ప్రకటన పేర్కొంది. హ్యూస్టన్‌ లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే మద్దతతో ఇండియా హౌస్ ఇయాన్ తన సొంత పట్టణంలో ఇల్లు కొనుగోలు చేసేందుకు లక్ష డాలర్ల విరాళాలను సేకరించిందని కూడా ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఇయాన్‌కు లక్ష డాలర్ల చెక్‌ను అందజేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/