అమెరికాలో మనోళ్ల మిస్టరీ హత్య/ ఆత్మహత్య!

Wed Feb 20 2019 10:25:57 GMT+0530 (IST)

భారత సంతతి దంపతులు ఇరువురు అనుమానాస్పద రీతిలో మరణించారు. టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం మిస్టరీగా మారటమే కాదు..జరిగింది హత్యా?  ఆత్మహత్యా? అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి. టెక్సాస్ లోని షుగర్ లాండ్ ప్రాంతంలో నివాసం ఉండే ఈ దంపతులు వృత్తిపరంగా ఉన్నత స్థానాల్లో ఉండటమే కాదు...స్థానికంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది. అంతేకాదు.. వీరు ఇరువురి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందన్న పేరుంది.హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ నకిరేకంటి (51) .. ఆయన సతీమణి శాంతి నకిరేకంటి (46) ఇరువురు అనుమానస్పద రీతిలో మరణించారు. ఈ విషాద ఉదంతంపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత భర్త భార్యను తుపాకీతో కాల్చి చంపి.. తర్వాత తనను తాను కాల్చేసుకొన్నారన్నది మొదటి వాదన. మరో వాదన ప్రకారం ఇరువురిని ఎవరైనా హత్య చేశారా? అన్నది క్వశ్చన్ గా మారింది. మరణించిన దంపతులది ప్రేమ వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 21 ఏళ్ల కొడుకు వేరే ప్రాంతంలో చదువుతుండగా.. ఘటన జరిగిన వేళలో కుమార్తె ఇంట్లోనే ఉంది. కాకుంటే.. ఆ సమయంలో ఆమె నిద్ర పోతున్నట్లుగా చెబుతున్నారు.

ఇంట్లోకి వచ్చే మార్గంలో జరిగిన తుపాకీ కాల్పుల్లో భార్య మరణించగా.. తన బెడ్రూంలో భర్త చనిపోయారు. ఇరువురు మరణానికి కారణం మాత్రం తుపాకీ తూటానే. కుమార్తెను స్నేహితుడి సంరక్షణలో ఉంచినట్లుగా స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఉదంతానికి ముందు శ్రీనివాస్ తన స్నేహితుడికి ఒక మొయిల్ రాసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా పోలీసులు అడ్డుకున్నారు. విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ వివరాల్ని గుట్టుగా ఉంచినట్లు భావిస్తున్నారు. శ్రీనివాస్ హ్యుస్టన్ లోని ఒక అయిల్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తుండగా.. ఆయన సతీమణి శాంతి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్లగా.. కాలేజీలో ఇరువురి పరిచయం జరగటం.. అది కాస్తా పెళ్లి వరకూ వెళ్లగా.. తాజాగా చోటు చేసుకున్న విషాదంతో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణం.. హత్యనా? .. భర్తే భార్యను చంపి తానూ చనిపోయారా? అన్నది తేలాల్సి ఉంది.