Begin typing your search above and press return to search.

ఎవ్వరి వల్లా కానిది వీళ్లు సాధించారు

By:  Tupaki Desk   |   10 Dec 2018 7:36 AM GMT
ఎవ్వరి వల్లా కానిది వీళ్లు సాధించారు
X
విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఏ భారత జట్టుకూ సాధ్యం కానిది ఈ జట్టు సాధించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా భారత్ 11సార్లు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ లు ఆడగా.. తొలి మ్యాచ్‌ లో ఎనిమిది సార్లు ఓటమి చవిచూసింది. మూడుసార్లు మాత్రమే మ్యాచ్ డ్రా అయింది. ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రతిసారీ తొలి టెస్టులో ఓడకుంటే చాలు అన్న పరిస్థితి ఉండేది. అలాంటిది ఈసారి ఏకంగా విజయమే సాధించింది. అడిలైడ్ లో సోమవారం ముగిసిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం భారత్ కు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఒక దశలో భారత్ ను ఓటమి భయం కూడా వెంటాడింది.

323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 104/4తో నిలిచిన సంగతి తెలిసిందే. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ షాన్ మార్ష్.. ట్రావిస్ హెడ్ మరీ ఎక్కువసేపేమీ పోరాడలేదు. హెడ్ (14) ఆట ఆరంభమైన కాసేపటికే ఔటయ్యాడు. 31 పరుగులతో క్రీజులోకి వచ్చిన మార్ష్ 60 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో ఇక భారత్ విజయం లాంఛనమే అనిపించింది. కానీ కెప్టెన్ టిమ్ పైన్ (41)తో పాటు.. లోయరార్డర్ బ్యాట్స్ మెన్ కమిన్స్ (28).. స్టార్క్ (28).. లైయన్ (38 నాటౌట్) గొప్పగా పోరాడి ఆస్ట్రేలియా జట్టులో ఆశలు రేపారు. లైయన్ కు.. హేజిల్ వుడ్ (13) నుంచి సహకారం అందడంతో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. మ్యాచ్‌ లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఐతే ఆసీస్ విజయానికి 32 పరుగులే అవసరమైన స్థితిలో హేజిల్ వుడ్ ను అశ్విన్ ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాల్లో టెస్టు మ్యాచ్ లు గెలిచిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు.