Begin typing your search above and press return to search.

మన మీద ప్రకృతికి ఎంత ఆగ్రహం అంటే..?

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:39 AM GMT
మన మీద ప్రకృతికి ఎంత ఆగ్రహం అంటే..?
X
ప్రపంచంలో దేవుడు ఉన్నాడా? లేడా? అన్న చర్చ మొదలుపెడితే.. ఒక పట్టాన ఆగదు. అయితే.. దేవుడు ఉన్నాడని నమ్మేవారు.. దేవుడు లేడని విశ్వసించే ఇద్దరూ ఒప్పుకునేది మాత్రం ఒకటి ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని చిటికెలో ప్రభావం చేసే సత్తా ఉన్నది ఒక్క ప్రకృతికి మాత్రమే. కనిపించని దేవుడే కాదు.. కంటికి కనిపించని ప్రకృతి అనే మహాశక్తికి ఆగ్రహం కలగాలే కానీ.. పెద్దన్న మొదలు ప్రపంచంలోని సమస్త జీవులు వణికిపోవాల్సిందే. మనిషి తన స్వార్థంతో.. అవగాహన రాహిత్యంతో ప్రకృతికి కోపం వచ్చేలా చేస్తుంటాడు. కోట్లాది మంది చేసే వేల కోట్ల తప్పుల్ని సైతం పట్టించుకోని ప్రకృతి ఎప్పుడైనా తనకు అసౌకర్యం కలిగితే కించిత్ కదిలితేనే అతలాకుతలమైపోతుంది.

అందరి తప్పుల్ని ఓర్పుగా భరించే ప్రకృతి.. అప్పుడప్పుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అలా కోపాన్ని చూపించే దేశాలు కొన్ని కనిపిస్తాయి. వారు తప్పులు చేసినా.. చేయకున్న ప్రకృతి కారణంగా తరచూ తిప్పలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి తిప్పలు ఏ దేశానికి ఎక్కువన్న విషయంపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎన్విరానిమెంట్ అండ్ హ్యుమన్ సెక్యూరిటీ..వరల్డ్ డిజిస్టర్ రిపోర్ట్ ను తయారు చేశారు.

ప్రకృతి వైపరీత్యాలైన తుపాన్లు.. భూకంపాలు.. వరదలు లాంటి వాటి వల్ల పొంచి ఉన్న ముప్పును అంచనా కట్టారు. ప్రపంచంలోని మొత్తం 171 దేశాలకు ప్రకృతి నుంచి ఉండే ముప్పును అంచనా కట్టి ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో మన దేశానికి ఇచ్చిన ర్యాంకు చూస్తే.. ప్రకృతికి మన పట్ల కోపం స్థాయిని చూస్తే.. మరీ తక్కువా కాదు.. అలా అని మరీ ఎక్కువా కాదనిపించక మానదు. మొత్తం 171దేశాల్లో మనర్యాంకు 77వ స్థానంలో ఉన్నట్లు తేల్చారు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ప్రకృతి మన మీద తన ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పుడు దాని వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకునే చర్యలు.. మప్పు ఏర్పడినప్పుడు సాయం అందించే విషయంలోనూ.. ఆగ్రహాన్ని ఎదుర్కొనే అంశంలోనూ మనం చాలా వెనుకబడి ఉన్నామన్న విషయం అర్థమవుతుంది. ఏదైనా విపత్తు విరుచుకుపడితే వెంటనే స్పందించే గుణం చాలాదేశాలకు లేనట్లే.. మన దగ్గరా ఇలాంటి సామర్థ్యం తక్కువనే చెప్పాలి. రవాణా వసుతుల నాణ్యత తక్కువగా ఉందన్న విషయం స్పష్టమైంది. ఇక.. దేశం మొత్తమ్మీదా 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంటే.. అందులో 5700 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రాంతానికి తుపాన్లు.. సునామీల ముప్పు ఉందన్న విషయం తాజాగా స్పష్టమైంది. ఇక.. దేశంలోని వ్యవసాయ ప్రాంతానికి కరవు ముప్పు 68 శాతం ఉన్నట్లుగా తేల్చారు. భూకంప ప్రమాదం కూడా దేశానికి ఎక్కువే. దేశంలోని 58.6 శాతం భూభాగానాకి ఒక మోస్తరునుంచి అత్యధిక భూకంప ప్రమాదం ఉండటం గమనార్హం. ఇక.. ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు.. గుజరాత్ లోని కొంత భాగానికి భూకంప తీవ్రత చాలా ఎక్కువన్న విషయం తేలింది.

ప్రపంచంలో ప్రకృతి ప్రకోపానికి గురయ్యే టాప్ దేశాలు చూస్తే..

1. వనాటూ

2. టోంగా

3. ఫిలిప్పీన్స్

4. గ్వాటెమాలా

5. బంగ్లాదేశ్

6. సాల్మన్ ఐలాండ్స్

7. బ్రూనై

8. కోస్టారికా

9. కంబోడియా

10. పపువా న్యూగినియా