Begin typing your search above and press return to search.

సిగ్గులేని నేతలు : ఏ వెలుగులకీ ప్రస్థానం?

By:  Tupaki Desk   |   3 Oct 2015 5:30 PM GMT
సిగ్గులేని నేతలు : ఏ వెలుగులకీ ప్రస్థానం?
X
ఒకవైపు భారత్ అమెరికాల మధ్య 21వ శతాబ్ది భాగస్వామ్యం అంటూ ఇరుదేశాల నేతలూ ముక్తాయిస్తుంటారు. మరోవైపు 2015లో కూడా మన దేశంలో పసిపిల్లలు అన్యాయంగా కుక్కలు - ఎలుకల బారిన పడి ప్రాణాలు విడిచేస్తుంటారు. 21వ శతాబ్ది భాగస్వామ్యానికి ఇంతకంటే మించిన అపహాస్యం మరొకటి ఉండదు. మరోవైపు ఎవరో ఎక్కడో తమకు ఇష్టమైన - అలవాటైన - తోచిన మాంసాన్ని తింటున్నారని అనుమానం వచ్చినంతమాత్రానే ఇంట్లోకి దూరి చావబాది చంపడం కూడా మన దేశంలో మాత్రమే జరుగుతుంటుంది. దేశ ప్రగతి గురించి గొప్పలు చెబుతున్న వారికి ఈ మచ్చలు కనబడటం లేదా?

ఒక్కటి మాత్రం వాస్తవం. మన దేశంలో మనుషుల్ని చంపాలంటే తుపాకులు - ఉరికొయ్యలూ - మరణశిక్షలూ ఏమాత్రం అవసరం లేదు. ఇంతమంది పోలీసు బలగాలను పెంచి మేపాల్సిన అవసరం అంతకంటే లేదు. వీధికొక చోట డ్రైనేజీ - వీధిలో వేలాడే కరెంటు తీగలు - రోడ్డు పక్క ఒక ఆసుపత్రి - ఆ పక్కనే కల్తీ కల్లు - మద్యం.. ఇవి ఉంటే చాలు.. మనుషుల ప్రాణాలు ఉట్టి పుణ్యానికే పోవడానికి.

ఆసుపత్రుల్లో పసికందుల్ని ఎలుకలు కొరికేస్తున్నా దిక్కులేదు. దశాబ్దాలుగా అలవాటు చేయించిన కల్తీ మద్యం - కల్లు బారినపడి మనుషులు చస్తున్నా దిక్కులేదు. చదువుకునేందుకు బయటకు వెళ్లిన పసిపాపలు రోడ్డు పక్క మురికికాలువల్లో పడి మాయం అవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ఆ రెండ్రోజులూ కాస్త టీవీ షో ఇస్తే చాలు.. తర్వాత నేతలు అన్నీ మర్చి తమ దందాల్లో గడిపేయవచ్చు.

నెలరోజుల క్రితం కన్నబిడ్డ గుంటూరు ఆసుపత్రిలో ఎలుకల కాటుకు బలై దూరమైతే నేటికీ విలవిల్లాడుతున్న ఆ కన్నతల్లి రమణమ్మ పెడుతున్న శోకన్నాలు ప్రభుత్వాల దరికి చేరుతున్నాయా? విశాఖలో మురికికాలువలో పడి కన్నుమూసిన చిన్నారి అదితి తల్లిదండ్రులకు సాంత్వన పలకడానికి వచ్చిన ఆమె మన నేతలనూ - వ్యవస్థనూ ఒకే ప్రశ్న అడుగుతోంది. ఇందుకేనా మిమ్మల్ని గెలిపిస్తున్నది. మా బిడ్డల ప్రాణాలు పోగొట్టుకోవడానికేనా మీకు ఓట్లేస్తున్నది? ఎంతమంది ప్రాణాలు పోతే మీరు కళ్లు తెరుస్తారు? అంటూ ఆమె ప్రదర్శించిన శోకాగ్రహానికి జవాబిచ్చేదెవరు?

శతాబ్ది భాగస్వామ్యం అంటూ ఎచ్చులు పోతున్న మహానేతలు మన నేలమీద ప్రతిరోజూ జరుగుతున్న ఘోరాలను పట్టించుకోవడం లేదా? స్వచ్ఛభారత్ నిర్దేశకులకు ఆసుపత్రుల్లో ఎలుకల స్వైర విహారం వినబడలేదా? కన్న తల్లుల గర్భశోకాన్ని ఏ భాగస్వామ్యాలు తీరుస్తాయి?