Begin typing your search above and press return to search.

దేశ‌విభ‌జ‌న గురించి ఆ కేంద్ర‌మంత్రి కొత్త రచ్చ‌

By:  Tupaki Desk   |   17 Sep 2018 7:20 AM GMT
దేశ‌విభ‌జ‌న గురించి ఆ కేంద్ర‌మంత్రి కొత్త రచ్చ‌
X
వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సుప‌రిచిత‌మైన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మ‌రోమారు అదే త‌ర‌హా ర‌చ్చ‌ను సృష్టించారు. గ‌తంలో కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాగాంధీ చర్మం రంగుపై గిరిరాజ్ సింగ్ క‌ల‌క‌లం రేకెత్తించే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ తెల్ల‌గా ఉంది కాబ‌ట్టే ఏఐసీసీ అధ్యక్షురాలు ఆమెను ఎన్నుకోవ‌డ‌మే కాకుండా కొన‌సాగిస్తున్నార‌ని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడం ర‌చ్చ‌ర‌చ్చగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. ఆ మంత్రి మాన‌సిక వ్యాధితో బాధపడుతున్నార‌ని ఆయ‌న‌ అనారోగ్యాన్ని ప్రభుత్వం నయం చేయించాల‌ని ఎద్దేవా చేశారు. అనంత‌రం ప్ర‌ధాని మోడీ మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడి తీరును త‌ప్పుప‌డుతూ విరుచుకుప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ త‌న నోటిని అదుపులో పెట్టుకోని ఆయ‌న మ‌రోమారు క‌ల‌క‌లం రేపే ట్వీట్ చేశారు.

ఈ దఫా దేశ విభ‌జ‌న గురించి గిరిరాజ్‌ సింగ్ కొత్త వివాదం సృష్టించారు. దేశంలో జనాభాను అరికట్టే చట్టం రాకపోతే మరోసారి ముక్కలవడం ఖాయమని ట్వీట్ చేశారు. దేశంలోని 54 జిల్లాల్లో హిందూ జనాభా బాగా తగ్గిపోయిందని - ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమాజ శాంతికి - ప్రగతి భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1947లో 33 కోట్లున్న దేశ జనాభా.. ఇప్పుడు అధికారికంగా 125 కోట్లకు చేరింది, అదే అనధికారికంగా 141 కోట్ల దాకా ఉంటుందన్నారు. వేర్పాటవాదుల జనాభా ఇలాగే పెరుగుతూ పోతే 2047 నాటికి దేశం మరోసారి ముక్కలయ్యే ప్రమాదం ఉందన్నారు. జమ్మూ-కాశ్మీర్ కు సంబంధించి 35-ఏ సెక్షన్ మీద అలజడి రేగడం గమనించాలన్నారు. కాగా, తాజాగా మ‌రోమారు ఆయ‌న త‌న‌దైన శైలిలో ర‌చ్చ సృష్టించార‌ని అంటున్నారు.

కాగా, పార్టీ సమావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా ప్రధాని మోడీ లక్ష్మణరేఖ దాటవద్దంటూ కేంద్ర‌మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కు సూచించారు. పార్టీ ముఖ్యుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో అయినా వివాదాస్ప‌దంగా మాట్లాడుతున్న తీరులో మార్పు వ‌స్తుందేమోన‌ని చూసిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేదంటున్నారు. ఈ కామెంట్లపై బీజేపీ పెద్ద‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.