Begin typing your search above and press return to search.

భారత్ సంపన్న దేశాల సరసన చేరిందట!

By:  Tupaki Desk   |   23 Aug 2016 3:30 PM GMT
భారత్ సంపన్న దేశాల సరసన చేరిందట!
X
మావా.. ముంబైకి రోజూ లక్షల్లో జనం వస్తుంటారు కానీ.. అన్నీ ఒక్కడికే దొరుకుతాయి. ముంబై ఇవ్వడమంటూ మొదలుపెడితే ఎంతైనా ఇస్తుంది. మావా.. ముంబైలో పది రూపాయలకూ ఫుడ్ దొరుకుతుంది, పదివేలకు కూడా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడా పావ్ తిని బ్రతికేస్తున్నారు.. వడాపావ్ ఎంతో తెలుసా.. ఏడు రూపాయలు! ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలో ముంబై గురించి అక్కడికి కొత్తగా వచ్చిన హీరోకి తన స్నేహితుడు చెప్పే డైలాగ్. ఈ డైలాగును కేవలం ముంబై కి మాత్రమే కాకుండా, మొత్తం భారతదేశానికి కూడా అన్వయించి చూసుకుంటే కరెక్టుగానే సరిపోతుంది. ఈ దేశంలో ప్రతీరోజూ లక్షల్లో జననాలు జరుగుతుంటాయి.. అయినా కూడా వారిలో ఒక్కడికే అన్నీ దొరుకుతాయి అని. ఇదేనేమో భిన్నత్వంలో ఏకత్వం అనే అనుమానం కలిగినా... ఇది వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలోని వ్యక్తులూ ఉన్నారు.. అత్యంత నిరుపేదలూ ఉన్నారు. అయినా సరే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సర్వేలో భారతదేశం ధనవంతుల దేశాల్లో ఒకటిగా నిలిచిందట.

"న్యూ వరల్డ్ వెల్త్" విడుదల చేసిన తన తాజా నివేదికలో.. భారత్ ఎదుగుతోందని - ప్రపంచంలోని పది ధనిక దేశాల్లో భారత్ ఏడో స్థానంలో నిలించిందని చెప్పింది. ఈ వివరాల ప్రకారం వ్యక్తిగత ధనవంతుల జాబితాలో భారత్ 5,600 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 48,900 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 17,400 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలోనూ - 15,100 బిలియన్ డాలర్లతో జపాన్ మూడో స్థానంలోనూ నిలిచాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 4,700 బిలియన్ డాలర్లతో కెనడా - 4,500 బిలియన్ డాలర్లతో ఆస్ట్రేలియా - 4,400 బిలియన్ డాలర్లతో ఇటలీ లు వరుసగా 8 - 9 - 10 స్థానాల్లో నిలిచాయి. కాకపోతే ఆస్ట్రేలియా జనాభా కేవలం 2.2 కోట్లు - భారతదేశ జనాభా సుమారు 125 కోట్లు! ఈ సర్వే ప్రకారం భారత్‌ పేద దేశం కాదని చెప్పడానికి ఈ నివేదిక ఒక నిదర్శనమని ఇకపై సోకాల్డ్ మేధావులు బల్లలు గుద్దేస్తారేమో!

దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన సగటు నికర ఆస్తులను పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారట. ఇందులో ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. ఇంకా.. గత ఐదేళ్లుగా చైనా ధనికదేశంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇదే క్రమంలో ఆస్ట్రేలియా - భారత్‌ లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని న్యూ వరల్డ్ వెల్త్ తెలిపింది.